ఇది బయోపిక్‌ల కాలం. అవార్డులూ, వసూళ్లూ తీసుకొచ్చే మ్యాజిక్ బయోపిక్‌లకు తెలుసని.. దర్శక నిర్మాతలు నమ్ముతున్నారు. పైగా.. ఆయా సినిమాలపై ఫోకస్ కూడా బాగుంటుంది. కాంట్రవర్సీలతో పబ్లిసిటీ చేసుకునే వీలుంటుంది. మహానటి తరవాత.. తెలుగులో బయోపిక్‌లకు మరింత ఊతం వచ్చింది. ఈ క్రమంలో కొన్ని బయోపిక్‌లు రెడీ అవుతున్నాయి. ఇప్పుడు మరి కొన్ని స్క్రిప్టు దశలో ఉన్నాయి.
ఉదయ్ కిరణ్ బయోపిక్ గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని అనుకున్నారు. అయితే.. ఇప్పుడు రాంగోపాల్ వర్మ ఈ బయోపిక్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. హృదయ్ కిరణ్ అనే పేరు కూడా ఫిక్స్ చేశాడట. ఈమధ్య మెగా కుటుంబాన్ని టార్గెట్ చేశాడు వర్మ. ఉదయ్ కెరీర్ పతనం వెనుక మెగా కుటుంబం హ్యాండ్ ఎంతుంది? అనే కోణంలోనే ఈ బయోపిక్ సాగబోతోందని తెలుస్తోంది.
ఆర్తి అగర్వాల్ బయోపిక్ కూడా రానున్నదని ఇటీవల వార్తలొచ్చాయి. ఓ కెరటంలా ఎగసి పడిన కెరీర్.. ఆర్తి అగర్వాల్ ది. ఓ యువ కథానాయకుడితో ప్రేమాయణం నడిపిందని, అది విఫలమైందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ బయోపిక్ కూడా అదే నేపథ్యంలో సాగబోతోందని టాక్. సౌందర్య, భానుమతి రామకృష్ణ, దాసరి నారాయణ రావు.. వీళ్లందరి బయోపిక్‌లు వచ్చే ఛాన్సుందని అందుకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇండ్రస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వీళ్ల లక్ష్యం.. వెండి తెర కాదు. కనీసం ఓటీటీలో అయినా విడుదల చేసుకోవచ్చని ప్లాన్. అందుకు తగ్గట్టుగానే బడ్జెట్ పెడుతున్నార్ట. మొత్తానికి టాలీవుడ్ కి కథల లోటుని కాస్తలో కాస్త తీరుస్తున్నాయి ఈ బయోపిక్‌లు. మరి ఇందులో ఎన్ని మహానటిలా నిలబడిపోతాయో, ఎన్ని `ఎన్టీఆర్` కథలా బోల్తా పడతాయో చూడాలి.