బ్రహ్మానందం అంటేనే.. ఆనందం. ఆనందం అంటేనే బ్రహ్మానందం. హాస్య పాత్రలకు కేరాఫ్ అడ్రస్ బ్రహ్మీ. తన కామెడీ ట్రాక్ తోనే సినిమా హిట్టయిన సందర్భాలు కోకొల్లలు. అయితే ఇప్పుడు బ్రహ్మానందం జోరు తగ్గింది. ఆయనకు అవకాశాలు రావడమే గగనం అయిపోయింది. నవతరం హాస్యనటుల జోరు ముందు.. బ్రహ్మానందం సీనియారిటీ మరుగున పడిపోయింది. అందుకే బ్రహ్మానందం రూటు మార్చారేమో. ఇప్పుడు ఓ ట్రాజెడీ పాత్రతో ప్రేక్షకులతో కంటతడి పెట్టించడానికి సిద్ధమయ్యారు.
కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న `రంగమార్తాండ`లో ఓ కీలకమైన పాత్ర చేస్తున్నారు బ్రహ్మానందం. అయితే.. ఇది బ్రహ్మీ స్టైల్ ఆఫ్ పాత్ర కాదు. పూర్తి ట్రాజెడీ పాత్ర. నాలుగైదు సన్నివేశాల్లో ఈ పాత్ర ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించబోతోంది. ఈ పాత్రకు ఓ యాంటీ క్లైమాక్స్ ఇవ్వబోతున్నారు కృష్ణవంశీ. కథ ప్రకారం.. బ్రహ్మీ పాత్ర ఈ సినిమాలో చనిపోతుంది. ఆ సమయంలోనూ… ప్రేక్షకుల గుండెలు బరువెక్కుతాయట. మరాఠీలో గొప్ప విజయం సాధించిన `నట సామ్రాట్` కి ఇది రీమేక్. నానాపటేకర్ పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. `నట సామ్రాట్`లో నానాపటేకర్ తో పాటు మరో కీలకమైన పాత్ర ఉంది. అక్కడ విక్రమ్ ఘోఖలే ఈ పాత్ర పోషించారు. అదే పాత్రలో ఇప్పుడు బ్రహ్మానందం కనిపించబోతున్నారు. ట్రాజెడీ పాత్రలు పోషించడం బ్రహ్మీకి కొత్త కాదు. ఇది వరకుకొన్ని సినిమాల్లో ఆయన కంట తడి పెట్టించే ప్రయత్నం చేశారు. ఆ పాత్రలన్నీ బ్రహ్మానందానికి మంచి పేరు తీసుకొచ్చాయి. మరి ఈసారి రంగమార్తండలో ఏం జరుగుతుందో చూడాలి.