ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికీకరణ లేదు. కొత్త ప్రభుత్వం పరిశ్రమలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అయినా సరే.. అందరికీ హైదరాబాద్ ఉందనే భరోసా ఉంది. డిగ్రీ అయిపోగానే.. హైదరాబాద్ బస్సో… రైలో ఎక్కేస్తే.. అక్కడ చుట్టుపక్కున ఉన్న పరిశ్రమల్లో ఏదో ఓ ఉపాధి దొరుకుతుందన్న ఆశ ఉంటుంది. ఇక ఇప్పుడు…దాన్ని వదులుకోవాల్సిందే. ఎందుకంటే.. ఏపీ ప్రభుత్వం తీసుకున్నట్లుగా … స్థానికులకే ఉద్యోగాలివ్వాలనే నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్ తీసుకుంది. కేబినెట్ భేటీలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించి తమ విధానాన్ని ఖరారు చేసుకున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్‌లో.. ముందూ వెనుకా చూసుకోకుండా.. ఎలాంటి కంపెనీ పెట్టాలన్నా 75 శాతం స్థానికులకే ఉద్యోగాలివ్వాలని చట్టం చేశారు. అయితే.. పరిశ్రమ అనేది స్కిల్డ్ లేబర్ మీద ఆధారపడితే… ఆ నిబంధన అమలు చేయడం సాధ్యం కాదు. ఇలాంటి వాటి వల్ల ఏపీలో పరిశ్రమలు పెట్టే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఈ ప్రమాదాన్ని ఊహించిన కేసీఆర్… వ్యూహాత్మకంగా జాబ్స్ పాలసీని ఖరారు చేసుకున్నారు. పాక్షిక నైపుణ్యం ఉన్న మానవ వనరుల్లో స్థానికులకు 70 శాతం.. నైపుణ్యం ఉన్న మానవ వనరుల్లో 50 శాతం తప్పనిసరిగా స్థానికులకే ఇస్తారు. పాక్షిక నైపుణ్యం ఉన్న కొలువుల్లో 80 శాతం నైపుణ్యం ఉన్న మానవ వనరుల విభాగంలో 60 శాతం స్థానికులకే ఇస్తే అదనపు ప్రయోజనాలు కల్పిస్తారు. ప్రత్యేకంగా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ వంటి సంస్థల ద్వారా తెలంగాణ యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించారు.
నిజానికి స్థానికులకే 70 శాతం ఉద్యోగాలివ్వాలనే చట్టం చేయడం.. రాజ్యాంగ విరుద్ధమనే వాదన ఉంది. ఏపీ తర్వాత కర్ణాటక , మధ్యప్రదేశ్ కూడా ఇలాంటి చట్టాలు చేశాయి. ఇవి ఇది రాజ్యాంగంలోని 16వ అధికరణను ఉల్లంఘింస్తుందనే విమర్శలున్నాయి. అందుకే.., చట్టం కాకుండా.. జాబ్స్ పాలసీని రూపొందించారు. పరిశ్రమలకు స్కిల్డ్ లేబర్ ముఖ్యం. వారు ఎక్కడ ఉంటే అక్కడకు పరిశ్రమలు వెళ్తాయి. ఇప్పుడు స్థానికులకే ఉద్యోగాలనే నిబంధన పెట్టిన రాష్ట్రాల కన్నా… హైదరాబాద్ వంటి నగరాల వైపు.. ఎక్కువగా పరిశ్రమలు చూసే అవకాశం ఉంది. కొత్త విధానం వల్ల పరిశ్రమలు.. ప్రోత్సాహకాల కోసమైనా.. స్థానికుల్ని నియమించుకుంటాయి.
తెలంగాణ చట్టం చేయకపోయినా… వ్యూహాత్మక జాబ్ పాలసీ వల్ల… సాదా సీదా డిగ్రి పట్టుకుని హైదరాబాద్ వచ్చే ఆంధ్ర యువతకు.. ఇక ఉద్యోగాలు లభించడం కష్టమని చెప్పుకోవచ్చు. ఉన్నత చదువులు చదివి.. స్కిల్డ్ లేబర్‌గా మారితే… మాత్రం… ఎక్కడ ఉద్యోగం ఉన్నా… ఎలాంటి అడ్డంకులు రావు. కానీ సామాన్య యువతకు మాత్రం.. హైదరాబాద్ దూరంగా మారే ప్రమాదం ఉంది.