అది ఓ పచ్చని పల్లె. కానీ ఓ రోజు అక్కడి పంట కాలవల గోతాల్లో శవాలు బయటపడ్డాయి. ముక్కలు ముక్కలుగా నరికి గోతాల్లో కుక్కి అక్కడ పడేశారు. అందరూ దళితులు. మొత్తంగా ఎనిమిదిని దారుణంగా హత్య చేశారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వేట కొడవళ్ళతో, గొడ్డళ్లతో, బరిసెలతో దళితులను వెంటాడి, వేటాడి చంపారు. కొన్ని మృతదేహాలకు రాళ్లు కట్టి.. తుంగభద్ర కాల్వలో పడేశారు. ఇద్దరు అన్నదమ్ములను మల్లెతోటలోనే చంపి భూమిలో తొక్కేశారు. దళితులపై సాగిన ఈ దమనకాండ.. అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అది జరిగింది గుంటూరు జిల్లా చుండూరు గ్రామంలో. చేసింది.. రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు. ఇది జరిగి 29 ఏళ్లు అయింది. కానీ ఇప్పటి వరకూ.. ఆ మృతులకు న్యాయం అందలేదు. నిందితులంతా నిర్దోషులుగా బయటకు వచ్చారు. ఇప్పటికి ప్రశ్న మిగిలిపోయింది. ” అందరూ నిర్దోషులతే అయితే.. అక్కడ ఆ హత్యలు చేసింది ఎవరు..?”
1991 ఆగస్టు 6న చుండూరులో ఏం జరిగింది..?
కారంచేడు దళితుల ఊచకోతలో కమ్మ సామాజికవర్గం వారు పాల్గొంటే… చుండూరు ఊచకోత పూర్తిగా రెడ్డి సామాజికవర్గం పెద్దల చేతుల మీదుగా సాగింది. తెనాలి మండలంలోని చుండూరు పరిసర ప్రాతంలో రెడ్ల ఆధిపత్యం అధికంగా ఉంటుంది. అక్కడ దళితులు కూడా బాగా చదువుకుని ఉద్యోగాలు పొందుతున్న సమయం అది. రవి అనే దళిత కుర్రాడు .. పీజీ చదువుకున్నాడు. ఓ రోజు సినిమా హాల్లో .. కుర్రి శ్రీనివాసరెడ్డి … రవితో గొడవపడ్డాడు. కులం పేరుతో దూషించాడు. బాగా చదువుకున్న దళిత యువకుడైన రవి తిరగబడ్డాడు.. శ్రీనివాసరెడ్డికి ధీటుగా సమాధానం చెప్పాడు. దాన్ని తట్టుకోలేకపోయిన రెడ్డి సామాజికవర్గం అంతా కలిసి.. రవి బంధువుల ఇళ్లపై దాడి చేశారు. రవి ఆచూకీ చెప్పాలన్నారు. రవి .. చుండూరు పక్కనే ఉన్న పెద్దగాజుల పల్లె అనే గ్రామంలో బంధువుల ఇంట్లో దలదాచుకున్నాడు. పట్టుకున్న రెడ్డి సామాజికవర్గం నేతలు.. కొట్టుకుంటూ.. చుండూరు తీసుకువచ్చారు. పంచాయతీ పెట్టి… జరిమానా విధించారు. దళితులను ఊరిలో పని చేయకుండా బహిష్కరించారు. 1991లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సహజంగానే రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు. దళితుల గ్రామ బహిష్కరణ వివాదం రేగి.. ఉద్రిక్తతలు ఏర్పడినా… రెడ్లు ఉన్న ప్రాంతాల్లోనే పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయించారు. అయితే… దళితులపై ఏదో విధంగా దాడి చేయాలన్న ప్లాన్ను మాత్రం మరో విధంగా అమలు చేశారు.
ఎంత దారుణంగా చంపారంటే..?
ఊచకోత ఘటన జరగడానికి రెండు రోజుల ముందు రాజబాబు యువకుడ్ని… అమ్మాయిని ఏడిపించాడంటూ… తీవ్రంగా కొట్టారు. గొడవలు అవుతాయంటూ.. దళిత వాడను పోలీసులు నిర్బంధించేలా చేశారు. తర్వాతి రోజు.. మరో వ్యక్తిని గాయపరిచారు. అతన్ని చూసేందుకు దళితులంతా వెళ్లారు. సీఐగా ఉన్న వ్యక్తి సాయంతో… అలా గాయపడిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తున్న వారిని బృందాలుగా ఏర్పడి, ఇచనుపరాడ్లు, కత్తులు, గొడ్డళ్ళతో వేటాడారు. దేవరపల్లి జయరాజు, మాండ్రు రమేష్, రూబేను, జాలాది ఇమ్మానుయేలు, జాలాది ముత్తయ్య, మల్లెల సుబ్బారావులను చంపేశారు. జాలాది ఇమ్మానుయేలు మృతదేహం మీద పదుల సంఖ్యలో కత్తిపోట్లు ఉన్నాయి. ముత్తయ్య బ్రతికి ఉండగానే చేయి నరికి శరీరం నుండి వేరు చేసి పారేశారు. జాలాది ఐసాక్, రాజమోహన్ అనే దళితుని శవం తుంగభధ్ర కాలువలో దొరికింది. పంట కాలువల్లోనే పలువురు మృతదేహాలు దొరికాయి.
అప్పటి నుండి న్యాయం ఎండమావే..!
విచిత్రం ఏమిటంటే అక్కడ అలాంటి ఘటనలు ఏమీ జరగలేదంటూ బుకాయించి కేసు కూడా నమోదు చేయలేదు.. ఆగస్టు7 న మూడు శవాలు దొరికిన తరువాత మాత్రమే పై స్థాయి పోలీసు యంత్రాంగం ముందుకు కదిలింది. దేశవ్యాప్తంగా కలకలం రేపడంతో SC ST చట్టం ప్రకారమే ప్రత్యేక కోర్టు చుండూరులో ఏర్పాటు చేయాలని 107 మంది ఎంపీలు ఉద్యమించారు. ఫలితంగా 1993లో ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. మొత్తం 219 మంది మీద 12 FIR లు నమోదు చేసారు. 16 ఏళ్ళ తరువాత జులై 31,2007 న ప్రత్యేకకోర్టు 123 మంది మీద సాక్ష్యాలు లేవని విడుదల చేసి కేవలం 21 మందికి జీవిత ఖైదు, 35 మందికి ఒక సంవత్సరం శిక్షతో తీర్పు చెప్పారు. తీర్పుపై మళ్లీ నిందితులు హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. ఆఖరికి ఘటన జరిగిన 23 సంపత్సరాలకు, 22 ఏప్రిల్ 2014, ఎల్. నరసింహ రెడ్డి, ఎం. ఎస్. కే. జైస్వాల్ లతో కూడిన హైకోర్టు ధర్మాసనం సరైన సాక్ష్యాలు లేవని.. అందర్నీ నిర్దోషులుగా విడుదల చేసింది.
మేకలను బలి ఇస్తారు గానీ, పులులను కాదు : అంబేద్కర్
చుండూరు ఘటన జరిగినపుడు ఆంధ్రప్రదేశ్లో ఆవేశపడిన యువరక్తం ఇప్పుడు ఎవరి బతుకులు వారు చూసుకుంటున్నారు. కొంత మంది తమను ఊచకోత కోసిన రెడ్లకే మద్దతు పలుకుతున్నారు. అప్పట్లో… దళితుల కోసం పోరాడిన మేరుగ నాగార్జున ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ ఊచకోత నిందితులు ఆయన గెలుపు కోసం ప్రయత్నించారు. అయినా.. దళితులు ఆయనను నెత్తిన పెట్టుకున్నారు. బాబా సాహెబ్ చెప్పినట్లు “మేకలను బలి ఇస్తారు గానీ, పులులను కాదు” . కారంచేడు.. గుంటూరు ఘటనలు చూసినప్పుడు.. ఇదే గుర్తుకు వస్తుంది. నేడు దళితులపై జరుగుతున్న వరుస దాడులు.. పోలీసులే దానికి ముందుకు వరుసలో ఉండటం.. నాటి ఘటనల్ని గుర్తుకు తెస్తున్నాయి. కానీ.. ఇప్పుడు చైతన్యం తగ్గిపోయింది. తమ ఆణిచివేతను ప్రశ్నించిన వర్గమే… వర్గాలు.. రాజకీయాలుగా విడిపోయి… అనైక్యతకు గురయ్యారు. అందుకే.. ఇక ఎప్పటికీ.. ఈ అంశంలో న్యాయం జరుగుతుందన్న ఆశ ఎవరికీ ఉండదేమో..?