ప్రతీ సినీ కుటుంబానికీ ఓ నిర్మాణ సంస్థ ఉండడం ఎంత సహజంగా మారిందో, ఇప్పుడు ఓ ఓటీటీ సంస్థ ఉండడం కూడా అంతే రివాజుగా మారబోతోంది. ఓటీటీ సంస్థల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోంది. టీవీ ఛానళ్లలానే వాటి సంఖ్య కూడా పెరగబోతోంది. ప్రముఖ నిర్మాతలు ఓటీటీ సంస్థల్ని స్థాపించడానికి మొగ్గు చూపిస్తున్నారు. అందులో భాగంగానే మంచు వారి కుటుంబం నుంచి ఓ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మంచు విష్ణు ది కాస్త బిజినెస్ మైండ్. బిజినెస్ లో కొత్త ట్రెండ్స్ ని పట్టుకోగలడు. ఇప్పుడు ఓటీటీ ఆలోచన కూడా విష్ణుదే అని తెలుస్తోంది. అందుకు సంబంధించిన ప్రయత్నాలు కూడా మొదలెట్టినట్టు సమాచారం. మంచు ఫ్యామిలీ నుంచి యేడాదికి కనీసం నాలుగైదు సినిమాలైనా వస్తుంటాయి. అవి కాక.. విష్ణు వెబ్ సిరీస్ రంగంలోనూ అడుగుపెట్టాడు. జీ 5 కోసం `చదరంగం` అనే వెబ్ సిరీస్ నిర్మించాడు. అదే కోవలో మరిన్ని వెబ్ సిరీస్‌లను విష్ణు ప్లాన్ చేస్తున్నాడు. ఇవన్నీ కంటెంట్ బ్యాంక్‌ని సృష్ఠించడం కోసమే అని తెలుస్తోంది.