ఆగస్టు 9 మహేష్‌బాబు పుట్టిన రోజు. సోషల్ మీడియాలో… మహేష్ బాబు అభిమానుల సంబరాలు ఎప్పుడో మొదలైపోయాయి. ఆగస్టు 9న ఆ సందడి రెట్టింపు కానుంది. అయితే… తన పుట్టిన రోజుని పురస్కరించుకుని మహేష్‌బాబు అభిమానులకు ఓ విన్నపం చేశాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.. వేడుకలకు దూరంగా ఉండాలని, అభిమానులు ఇంటి దగ్గరే ఉండాలని సూచించాడు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ ప్రకటన చేశాడు మహేష్.
”మీరందరూ నాకు తోడుగా ఉండడం నా అదృష్టం. నా పుట్టిన రోజు ప్రత్యేకంగా ఉండాలని మీరు చేస్తున్న మంచి పనులకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సురక్షితంగా ఉండడమే అన్నింటికంటే ముఖ్యం. కాబట్టి.. ఇంటి దగ్గరే ఉండండి. సురక్షితంగా ఉండండి” అంటూ ట్వీట్ చేశాడు. మహేష్ కూడా తన పుట్టిన రోజుని చాలా సింపుల్‌గా చేసుకోవాలని భావిస్తున్నాడు. ఈ లాక్ డౌన్ సమయంలో కుటుంబంతోనే గడుపుతున్నాడు మహేష్. ఈ పుట్టిన రోజునీ.. మహేష్ తన కుటుంబానికే కేటాయించబోతున్నాడు.