మూడు నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల సందడి ప్రారంభమవనుంది. గత కేబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకు..రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేస్తామని జగన్ మేనిఫెస్టోలో పెట్టారు. ఆ ప్రకారం ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ కమిటీ తన నివేదికను మూడు నెలల్లో ఇవ్వాలని గడువు విధించారు. కమిటీ తన అధ్యయనంలో భాగంగా మౌలిక సదుపాయాలు, పరిపాలన సజావుగా జరగటానికి అవసరమైన వసతులు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడున్న ఉద్యోగులను 25 జిల్లాలకు ఎలా విభజించాలి..? అనే అంశంపై సిఫార్సులు చేయాల్సి ఉంటుంది. అలాగే… తాజాగా ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. రాష్ట్ర, జిల్లా, సబ్ జిల్లా స్థాయిలో వ్యవస్థ రూపురేఖలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని జీవోలో సూచించారు.
జిల్లాల ఏర్పాటుతో పరిపాలనపరమైన, ఇతర ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, దానికి తగ్గట్టుగా సిఫారుసు చేయాలని పేర్కొన్నారు. అతితక్కువ ఖర్చుతో కొత్త జిల్లాల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాలన్నారు. కొత్తగా ఏర్పడే 25 జిల్లాలకు భౌగోళిక సరిహద్దులను, పరిపాలన విభాగాల ఏర్పాటు ఎలా ఉండాలనే దానిపై తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని ఉత్తర్వుల్లో వెల్లడించారు. మూడు నెలలు గడువు ఇచ్చినందున పరిస్థితుల్ని బట్టి..నిర్ణయం పొడిగించడం చేసే అవకాశం ఉంది.