ఏపీలో కరోనా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కరోనాతో 89 మంది చనిపోయారు. కేసులు కూడా.. మరోసారి పదివేలకు పైగా నమోదయ్యాయ. దీంతో ఏపీలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 2 లక్షలు దాటింది. కేవలం 11 రోజుల్లోనే అదనంగా లక్ష కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా ఇప్పుడు విజృంభణ తగ్గింది. కానీ ఏపీలో మాత్రం ఊహించని స్థాయిలో పెరిగింది. ఏపీలో 11 రోజుల క్రితం 1090 మంది మరణించగా ఇప్పుడు ఆ సంఖ్య 18వందలు దాటిపోయింది.
అంటే 700 మంది 11 రోజుల్లోనే మరణించారు. 11 రోజుల వ్యవధిలో రాష్ట్రంలో ఒక లక్షా పది వేల కేసులు నమోదయ్యాయి. మధ్యలో ఒకటి,రెండు రోజులు తప్ప..దాదాపుగా ప్రతీరోజు.. 10 వేల చొప్పున కేసులు నమోదవుున్నాయి. ఏపీలో రికవరీ రేటు 55 శాతం మాత్రమే ఉంది. మరణాలు పెరుగుతూండటం… రికవరీ రేటు తగ్గడంపై … వైద్య నిపుణుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.
అయితే ప్రభుత్వం మాత్రం.. టెస్టులు ఎక్కువగా చేస్తున్నాం కాబట్టి.. ఎక్కువ కేసులు నమోదవుతున్నాయనే వాదన వినిపిస్తున్నారు. ఆ టెస్టులను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదు. అత్యధిక టెస్టులు చేసిన టాప్ 19 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లేదు. ప్రభుత్వం.. అందరికీ వస్తుందనే అభిప్రాయాన్ని విడిచి పెట్టి..కట్టడి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది.