పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుల అమలుపై స్టేటస్ కో విధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ స్టేటస్ కో ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరింది. హైకోర్టును ఎక్స్పార్టీగా పేర్కొంటూ ఈ పిటిషన్ దాఖలయింది. ప్రాథమిక కారణాలు తెలియకుండానే… స్టేటస్ కో ఇవ్వడం.. న్యాయసూత్రాలకు విరుద్ధమని ప్రభుత్వం వాదిస్తోంది. దీనిపై సోమవారం.. సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే హైకోర్టు కొట్టి వేసి.. స్టే ఇచ్చిన అనేక అంశాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఒక్క దాంట్లోనూ… ఏపీ సర్కార్ చేసింది కరెక్టన్న తీర్పు రాలేదు.
నిజానికి హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది.. కేవలం.. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడానికి అవసరమైన గడువు వరకే. మూడు రాజధానుల బిల్లులు… సీఆర్డీఏ రద్దు చెల్లవంటూ… అనేకానేక కారణాలు చూపిస్తూ.. హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారణకు స్వీకరించిన హైకోర్టు… ప్రభుత్వ వాదన ఏమిటి అని అడిగింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. అయితే.. తమకు కౌంటర్ దాఖలు చేయాడనికి పది రోజుల సమయం కావాలని ఆ న్యాయవాది కోరారు. దానికి హైకోర్టు అంగీకరించింది. అయితే.. అప్పటి లోపు.. ఎలాంటి తరలింపులు చేయకూడదని… ఆ బిల్లులపై స్టేటస్ కో ఇచ్చింది. ప్రభుత్వం రెండు రోజుల్లో కౌంటర్ దాఖలు చేసి ఉంటే.. హైకోర్టు రెండు రోజుల్లోనే విచారణ జరిపి ఉండేది. కానీ.. హైకోర్టులో కౌంటర్ దాఖలుకు పది రోజులు సమయం అడిగి.. ఈలోపే… ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.
హైకోర్టులో స్టే ఇవ్వలేదు. స్టేటస్ కో మాత్రమే ఇచ్చారు. యథాతథ స్థితిని ఉంచమన్నారు. ఆ బిల్లులను కొట్టి వేయలేదు.. స్టే కూడా లేదు. అంత మాత్రం దానికే.. సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏముందని.. హైకోర్టులో… కౌంటర్ దాఖలు చేసి తమ వాదనలు వినిపిస్తే ఏమవుతుందన్న విశ్లేషణ న్యాయవాద వర్గాల్లో వినిపిస్తోంది. ప్రభుత్వానికి న్యాయసలహాలు ఇచ్చేవారు.. ప్రభుత్వ పెద్దలను తప్పు దోవ పట్టిస్తున్నారన్న అనుమానాలను వీరు వ్యక్తం చేస్తున్నారు.