కొన్ని కథల్ని రీమేక్ చేయడం చాలా కష్టం. ఆ ఫీల్ ని క్యారీ చేయడం, ఆ మ్యాజిక్‌ని మళ్లీ రీ క్రియేట్ చేయడం సాధ్యం కాదు. కొన్నిసార్లు.. పాత్రలకు సరితూగే నటీనటుల్ని వెదికి పట్టుకోవడం కూడా కష్టమవుతుంది. `అంధాధూన్` రీమేక్ విషయంలో అదే జరుగుతోంది. హిందీలో మంచి విజయాన్ని అందుకుంది అంధాధూన్. తెలుగులో నితిన్ ఈ సినిమాని రీమేక్ చేస్తున్నాడు. మిగిలిన నటీనటులంతా ఫిక్సయినా.. టబు పాత్రకు రీప్లేస్మెంట్ దొరకడం లేదు.
మాతృకలో టబు చేసిన పాత్ర హైలెట్ అయ్యింది. ఓ రకంగా… ఈ సినిమాకి తనే హీరో.. విలన్ రెండూనూ. ఆ పాత్ర ఎవరికి అప్పగించాలన్న విషయంలో చిత్రబృందం తర్జన భర్జనలు పడుతోంది. అనసూయ దగ్గర్నుంచి మొదలెట్టి, నయనతార వరకూ అందరి పేర్లూ పరిశీలించారు. ఇటీవల చిత్రబృందం నయనను కలిసినట్టు, ఆమె రూ.9 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసినట్టు వార్తలొచ్చాయి. అదెంత వరకూ నిజమో తెలీదు గానీ.. చిత్రబృందం ఈ పాత్రని మళ్లీ టబు చేతే వేయించాలని ఫిక్సయినట్టు తెలుస్తోంది. ఇది వరకే టబుని సంప్రదిస్తే.. `చేసిన పాత్రే చేయను` అని ఖరాఖండిగా చెప్పేసిందట. కానీ.. మరోసారి ప్రయత్నించి చూద్దాం అన్నది దర్శక నిర్మాతల ఆశాభావం. నయనతారకు ఇచ్చేదాంట్లో సగం ఇచ్చినా టబు ఒప్పేసుకుంటుందన్న నమ్మకం. పారితోషికంతో టబుని టెమ్ట్ చేద్దామని, ఆఖరి ప్రయత్నంగా ఓసారి టబుని కలవాలని చిత్రబృందం భావిస్తోంది. టబు ఓకే అంటే.. దర్శక నిర్మాతలు ఊపిరి పీల్చుకోవొచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టబుని ఒప్పించడమే కష్టం. పారితోషికమే కావాలనుకుంటే మాత్రం టబు చేస్తుంది. లేదంటే… నిర్మాతల అన్వేషణ మళ్లీ మొదటికి వచ్చినట్టే.