రానా – మిహికల పెళ్లి అత్యంత సింపుల్‌గా, పరిమితమైన బంధుమిత్రుల సమక్షంలో, కరోనా ఆంక్షల మధ్య జరిగిపోయింది. కొద్దిసేపటి క్రితమే.. జిలకర్ర – బెల్లం తంతు ముగిసింది. ఇప్పుడు రానా – మిహికలు సంప్రదాయబద్ధంగా ఒక్కటైపోయారు. కరోనా ఆంక్షల మధ్య జరుగుతున్న పెళ్లి కావడంతో.. దగ్గుబాటి కుటుంబం అన్ని ముందస్తు జాగ్రత్తలూ తీసుకొంది. కేవలం 50 మంది అతిథులకే ఆహ్వానాలు అందాయి. అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహ వేడుకలో పాలుపంచుకున్నారు. టెక్నాలజీ పుణ్యమా అని రెండొందల కుటుంబాలు ఈ పెళ్లిని లైవ్ లో వీక్షించాయి. వర్చువల్ రియాలిటీ టెక్నాలజీతో ఈ పెళ్లిని దగ్గుబాటి కుటుంబ సభ్యులు ఇళ్లలోనే ఉండి వీక్షించారు. వారం రోజుల నుంచీ.. రామానాయుడు స్టూడియోలో సినిమా షూటింగులన్నీ ఆపేశారు. సినిమాకి సంబంధించిన ఏ ఒక్క కార్యక్రమమూ జరగలేదు. స్టూడియో మొత్తం శానిటైజేషన్ చేశారు. పెళ్లికి హాజరైన ప్రతీ అతిథికీ ఓ యాప్ ఇన్ స్టాల్ చేయించి, అందులో ఆరోగ్య సమాచారాన్ని నిక్షిప్తం చేయించారు. కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్, రామ్ చరణ్‌లు వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రభాస్ కూడా పెళ్లికి హాజరవుతాడని తెలుస్తోంది. కరోనా బారీన పడడంతో రాజమౌళి కుటుంబం ఈ పెళ్లికి హాజరవ్వడం లేదు.