ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్ట్ కాదని.. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖనే స్పష్టం చేసింది. ఈ మేరకు.. ఎన్జీటీకి స్పష్టమైన నివేదికను పంపింది. పర్యావరణ అనుమతులు అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే.. అపెక్స్ కౌన్సిల్, కృష్ణా రివర్ బోర్డు అనుమతి తీసుకోవాలని.. స్పష్టం చేసింది. ప్రాజెక్ట్‌కు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్.. డీపీఆర్ సమర్పిస్తే.. అనుమతులు వచ్చే అవకాశం ఉంది. కానీ ఏపీ సర్కార్ మాత్రం.. డీపీఆర్ సమర్పించలేదని కృష్ణాబోర్డు పదే పదే చెబుతోంది. కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ కూడా.. అదే అంశంపై శనివారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు.
విభజన చట్టం ప్రకారం… కొత్త ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తీసుకోవాలి. కొత్త ప్రాజెక్టులతే తెలంగాణ అభ్యంతరం చెప్పే అవకాశం ఉంది. రాయలసీమ ఎత్తిపోతల పాత ప్రాజెక్ట్ అని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖనే చెబుతోంది కాబట్టి.. ఇప్పుడు… మరింత దూకుడుగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది. తక్షణం.. కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌లు సమర్పించి… టెండర్లు ఖరారు చేసి.. రాయలసీమకు నీటి పంపిణీని ప్రారంభించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ.. డీపీఆర్ ఇవ్వకపోవడం వల్ల.. కృష్ణాబోర్డు.. టెండర్లను నిలిపివేయాలని పదే పదే ఆదేశిస్తూ లేఖలు రాస్తోంది. అయితే.. కృష్ణాబోర్డును పరిగణనలోకి తీసుకోని ఏపీ సర్కార్ టెండర్లను ఖరారు చేస్తోంది. పదొమ్మిదో తేదీన రివర్స్ టెండర్లను కూడా ఖరారు చేయనున్నారు.
డీపీఆర్ సమర్పించి.. అనుమతి తెచ్చుకునే రాజమార్గం ఉండగా.. ఏపీ ప్రభుత్వం.. ఎందుకు ఎవరినీ పరిగణనలోకి తీసుకోకుండా… ముందుకెళ్తూ.. వివాదాస్పదం చేయాలనుకుంటుందో అనే చర్చ ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఈ అంశాన్ని రాయలసీమకు నీరు అందించడానికి కాకుండా.. సెంటిమెంట్ రెచ్చగొట్టే రాజకీయం కోసం… ఇద్దరు ముఖ్యమంత్రులు వాడుకుంటున్నారనే విమర్శలు విపక్షాలు చేస్తున్నాయి. సీమకు మేలు చేయాలంటే… వివాదాల్లేకుండా.. ప్రాజెక్టును.. శరవేగంగా పూర్తి చేయాలన్న డిమాండ్ రాయలసీమలో వినిపిస్తోంది. మరి ప్రభుత్వం ఏ దిశగా ముందుకెళ్తుందో..?