వారిద్దరూ ఆడపిల్లల తల్లిదండ్రులు. కని పెంచి.. అల్లారుముద్దుగా పెంచి.. తమకు చేతనయినంతలో మంచోళ్లు అనుకునే వాళ్లకే కట్టబెట్టారు. కానీ వారు అనుకున్నంత మంచోళ్లు కాదు. ఆ విషయం తెలిసి తమ కూతుళ్లు జీవితాలు నాశనమయ్యాయని తెలుసుకున్న వారి స్పందన భిన్నంగా ఉంది. ఒకరు ఆత్మహత్య చేసుకుంటే.. మరొకరి అల్లుడి తల నరికి.. పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు. ఈ రెండు ఘటనలు.. ఏపీలో రెండు రోజుల వ్యవధిలో చోటు చేసుకున్నాయి.
ప్రాణం తీసుకున్న కడప తండ్రి ..!
సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడని… నమ్మి తన కూతుర్ని ఇచ్చి కట్టబెట్టాడు కడప జిల్లాకు చెందిన సగటు ఆడపిల్ల తండ్రి బాబుల్ రెడ్డి. కానీ ఆ అల్లుడి సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం ఉత్తుత్తిదే. అసలు ఉద్యోగమే లేకపోయినా… సాఫ్ట్ వేర్ ఉద్యోగమని చెప్పి… ఆ తండ్రిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఎన్నో ఊహాలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన బాబుల్ రెడ్డి కూతురికి ఆ తర్వాత నరకం కనిపించింది. చివరికి పుట్టింటికొచ్చేసింది. జరిగిందేదో జరిగిపోయిందని.. అనుకుంటే.. ఆ దొంగ సాఫ్ట్వేర్ ఇంజినీర్ వదిలి పెట్టలేదు. ఇంటికొచ్చి రచ్చ చేయడం ప్రారంభించాడు. దీంతో.. ఆ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని.. ఇద్దరు కూతుళ్లు కూడా.. రైలు కింద పడి చనిపోయారు..
అల్లుడు తల తెంపేసిన మరో తండ్రి..!
ఆంధ్రలోని తూ.గో జిల్లాలోని మరో ఆడపిల్ల తండ్రి మాత్రం.. ఆత్మహత్య చేసుకోవాలనుకోలేదు. అల్లుడినే చంపేశాడు. తల నరికి.. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాడు. అన్నవరం సమీపంలో ఉండే డీజేపురం అనే గ్రామానికి సత్యనారాయణ కుమార్తె పది నెలల క్రితం చనిపోయింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిని సత్యనారాయణే పెంచుతున్నారు. పిల్లలను చూడటానికి వచ్చిన అల్లుడు.. మద్యం తాగి… తన భ ార్యను అంటే.. సత్యనారాయణ కుమార్తెను తానే చంపానని.. చెప్పేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన సత్యనారాయణ కత్తితో లచ్చన్న తల నరికాడు. అనంతరం ఆ తలను సంచిలో వేసుకొని అన్నవరం పోలీసులకు అప్పగించాడు.
రెండు రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండు ఘటనలు.. ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపాయి.