నిజమే.. మీరు కరెక్ట్‌గానే చదివారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి జగన్ అభినందనలు తెలిపారు. మోడీ ఆ అభినందులు రిసీవ్ చేసుకుని .. జగన్ అభినందించినందుకు పొంగిపోయారో లేదో తెలియదు కానీ.. మోడీని జగన్ అభినందించిన విషయాన్ని .. ఆయన మీడియా గొప్పగా ప్రచారం చేసింది. ఇంతకూ జగన్‌కు మోడీని ఎందుకు అభినందించాల్సి వచ్చిందంటే… ఈ రోజు ప్రధానమంత్రి వ్యవసాయరంగానికి సంబంధించి రూ. లక్ష కోట్ల నిధిని ప్రారంభించారు. ఇదే జగన్‌ను అమితంగా ఆకర్షించింది. మనసులో దాచుకోకుండా… అభినందనలు పంపేశారు.
ప్రధాని ప్రారంభించిన రూ. లక్ష కోట్ల నిధి వల్ల రైతులు పండించిన పంటలకు విలువను జోడించడానికి .. ఉన్నత స్థాయి ఆదాయాలు పొందటానికి వీలు కల్పిస్తుందని జగన్ చెప్పుకొచ్చారు. సాధారణంగా ఎవరైనా… తన కంటే కింది స్థాయి వారికి ఏదైనా మంచి పనులు చేస్తే ప్రోత్సాహకానికి అభినందనలు చెబుతారు. స్ఫూర్తిగా ఉంటుందని.. పెద్దలు ఇలా అభినందనలు పంపుతూ ఉంటారు. సాధారణంగా.. తన కంటే పై స్థాయి వారికి కింది స్థాయి వారు… “శభాష్” అని చెప్పరు. చెబితే అతిశయోక్తి అవుతుంది. మంచి పని చేస్తే మహా అయితే కృతజ్ఞతలు చెబుతారు. రైతుల్ని ఆదుకున్న ధీరుడని పొగుడుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం.. అభినందనలు తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెబుతూ ఉంటారు. రైతులకు ఎవరూ చేయలేనంత సాయం చేశామని.. రైతు భరోసా కింద.. రూ. 7500 ఏడాదికి ఇస్తూంటారు. మిగతా రూ. 6వేలు కేంద్రం ఇస్తుంది. అంత మాత్రం దానికే తాము ఎంతో చేస్తూంటే.. ఇప్పుడు ప్రధాని మేలుకుని ఎంతో కొంత చేస్తున్నారన్న ఉద్దేశంతో.. అభినందనలు చెప్పినట్లుగా ఉందన్న చర్చ.. రాజకీయవర్గాల్లో నడుస్తోంది. అసలే సోషల్ మీడియా ఇలాంటి వాటిని ఎక్కువగా హైలెట్ చేస్తూ ఉంటుంది. వెటకారం చేశారని.. పై వాళ్లకు అనిపిస్తే.. జగన్‌కు ఇబ్బందులు ఎదురవతాయని.. జగన్ సోషల్ మీడియా టీం గుర్తించాల్సి ఉందంటున్నారు.