ఐదేళ్ల పాలనలో 13 జిల్లాలకు తెలుగు దేశం హయాంలో ఏం చేశామో.. ఎలా అభివృద్ది వికేంద్రీకరణ చేశామో… టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాకు వివరించారు. పదమూడు నెలల్లో…వైసీపీ సర్కార్ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన తర్వాత 16 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో వచ్చినా …ఎక్కడా అభివృద్ధిలో వెనుకడుగు వేయలేదన్నారు. రామాయపట్నం, బందర్, కాకినాడ, బావనపాడు పోర్టులకు నాంది పలికామని .. గోదావరి మిగులు జలాలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి బాటలు వేశామన్నారు. పోలవరం 72 శాతం పూర్తి చేశామని.. 62 ప్రాజెక్ట్‌లకు నాంది పలికామన్నారు. 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు చేసుకున్నామని ఇవన్నీ పూర్తయితే 32 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశముందన్నారు.
ఎన్ని కష్టాలు ఉన్నా నాలుగేళ్లు రెండెంకల అభివృద్ధి ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని చంద్రబాబు స్పష్టం చేశారు. మూడు నెలల్లోనే 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతను అధిగమించామని.. గ్రామాల్లో 25 వేల కి.మీ మేర సీసీ రోడ్లు వేసిన ఏకైక రాష్ట్రం ఏపీని గుర్తు చేశారు. 2022 నాటికి ప్రతి ఒక్కరికి ఇళ్లు ఉండాలని.. ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. చిత్తూరు జిల్లా నుంచి… శ్రీకాకుళం వరు..జిల్లాలకు తీసుకొచ్చిన పరిశ్రమలు.. ప్రారంభించిన ప్రాజెక్టులు..పెట్టిన ఖర్చును చంద్రబాబు వివరించారు.
వైసీపీ పదమూడు నెలలకాలంలో ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. విధ్వంసం కావాలా.. మాయ మాటలు కావాలా.. అభివృద్ధి కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు. కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తే ఎగతాళి చేశారని… ఇప్పుడు కరోనా రోగులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. అన్నీ తెలుసనే అహంభావంతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కోసమే అమరావతి.. అమరావతి కోసం ఆంధ్రప్రదేశ్ కాదని తేల్చారు. వాస్తవాన్ని ఎవరూ కనుమరుగు చేయలేరు.. శాశ్వతంగా మీ ఆటలు సాగవని హెచ్చరించారు.