మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ .. ప్రస్తుత పరిస్థితుల్లో మార్గదర్శి అంశాన్ని వెలుగులోకి తెచ్చేందుకు శక్తి మేర ప్రయత్నిస్తున్నారు. గతంలో హైకోర్టు కొట్టి వేసిన అంశాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్‌గా ఉన్న ఉండవల్లి అభ్యర్థన మేరకు.. ఆర్బీఐను కూడా ప్రతివాదిగా చేర్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉండవల్లి… మార్గదర్శి అంశాన్ని లేవనెత్తారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రూ.2,600 కోట్లు డిపాజిట్లు సేకరించారని ఆయన కోర్టుల్లో కేసులు వేశారు. ఈ వివాదం నేపధ్యంలో.. రామోజీగ్రూప్.. ఆ రూ. 2600 కోట్ల డిపాజిట్లన్నింటినీ… ఈటీవీ చానళ్లు అమ్మేసి.. తిరిగి చెల్లించేసింది.
అయితే.. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించినందున రామోజీరావు శిక్షార్హులే అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ న్యాయపోరాటం చేస్తున్నారు. 2018 డిసెంబరు 31న ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దాదాపుగా రెండేళ్ల తర్వాత ఉండవల్లి.. ఆ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు తీర్పు ఇచ్చేటప్పుడు రిజర్వు బ్యాంకు చట్టంలోని సెక్షన్ 45(ఎస్)ను సరిగ్గా అన్వయించలేదని ఉండవల్లి అంటున్నారు. హిందూ అవిభక్త కుటుంబం కింద ఉన్న సంస్థలకు డిపాజిట్లు సేకరించే అధికారం లేదని ఆయన అంటున్నారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. వారానికోసారి ప్రెస్‌మీట్ పెట్టి.. పోలవరం నుంచి మద్యం ధరల వరకూ… తన లాయర్ లాజిక్ పాయింట్లతో ప్రశ్నల వర్షం కురిపించే ఉండవల్లి… ఇప్పుడు కూడా అప్పుడప్పుడు తన తటస్థ హోదా నిలబెట్టుకోవడానికేమో కానీ… ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కానీ అయిపోయిన… మార్గదర్శి వంటి కేసులను వెలుగులోకి తెచ్చి.. కనీసం నోటీసులు ఇప్పించినా.. చాలు… అన్నట్లుగా ఆయన రాజకీయం మాత్రం మానలేదు.