వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏదైనా అనుకుంటే ఇట్టే నిర్ణయం తీసుకుంటారు. దానికి ముందూ వెనుకా ఎలాంటి మొహమాటాలు పెట్టుకోరు. దానికి తాజాగా మరో ఉదాహరణ ఎమ్మెల్సీ సీటుకు అభ్యర్థి ఎంపిక. రాజ్యసభకు పంపిన మోపిదేవి వెంకటరమణ స్థానంలో… ఎమ్మెల్సీ పదవికి ఎమ్మెల్యేల తరపున ఒకరు ఎన్నికవ్వాల్సి ఉంది. ఈ ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చింది. చాలా మంది ఆశావహులు ఉన్నారు. గత ఎన్నికల సమయంలో.. హామీ ఇచ్చిన వారందరూ.. తమకు చాన్స్ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు.
కానీ అనూహ్యంగా జగన్… మొన్న మరణించిన పెన్మత్స సాంబశివరాజు కుమారుడు సురేష్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఖరారు చేశారు. ఈనెల 13న నామినేషన్ వేయనున్నారు. జగన్ నిర్ణయం చూసి వైసీపీలో అందరూ షాకయ్యారు. నిజానికి పెన్మత్స సాంబశివరాజు …బొత్స గురువు. కానీ తర్వాత తన గురువుకే బొత్స ఎసరు పెట్టారు. ఆ తర్వాత బొత్సకంటే ముందే వైసీపీలో చేరారు. అక్కడా ఆయనకు టిక్కెట్ రాకుండా.. బొత్స చేశారు.
2019 ఎన్నికల్లో నెలిమర్ల టిక్కెట్‌ను పెనుమత్స సాంబశివరాజు కుమారుడు సురేష్‌కి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. తర్వాత బొత్స రాజకీయంతో ఆయన స్థానంలో బొత్స సోదరుడు అప్పలనాయుడికి టిక్కెట్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత వారు పూర్తిగా రాజకీయంగా కనుమరులగు కావాల్సిన పరిస్థితి. ఇప్పుడు హఠాత్తుగా ఆయన చనిపోవడంతో సురేష్‌కు ఎమ్మెల్సీ ఖరారు చేశారు. మర్రి రాజశేఖర్ సహా.. అనేక మంది ఆశావహులు… నిట్టూర్చాల్సి వచ్చింది.