కరోనా పేరు చెప్పి రెండు నెలల పాటు సగం సగం జీతాలే ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. జీతాలు, పెన్షన్ బకాయిలు చెల్లించాలని ఆదేశించింది.మార్చి, ఏప్రిల్ నెలల్లో బకాయిపడిన 50శాతం జీతాలు, పెన్షన్లను.. 12శాతం వడ్డీతో చెల్లించాలని స్పష్టం చేసింది. కరోనా, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా 50 శాతం మాత్రమే .. జీతాల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు కొట్టి వేసింది. విశాఖకు చెందిన రిటైర్డ్ జడ్జి కామేశ్వరి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం కరోనా లాక్ డౌన్ ప్రకటించిన నెలలో మొత్తం జీతాలు ఇవ్వడానికి బిల్లులు సిద్ధం చేసుకున్నారు.
అయితే అప్పుడే కేసీఆర్ సగం జీతాలే ఇవ్వాలని నిర్ణయించడంతో జగన్ కూడా మనసు మార్చుకున్నారు. రెండు నెలల పాటు సగం సగం జీతాలే ఇచ్చారు. పెన్షన్లు కూడా సగమే ఇచ్చారు. అయితే.. అప్పుడే.. పెన్షనర్లు కోర్టును ఆశ్రయించారు. ఆపడానికి అవకాశం లేదని న్యాయనిపుణులు చెప్పడంతో.. ఆ నెల నుంచి మొత్తం జీతాలు, పెన్షన్లు ఇస్తున్నట్లుగా కోర్టుకు తెలిపారు. కానీ రెండు నెలల బకాయిల గురించి మాత్రం చెప్పలేదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పుడు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి ప్రాతిపదిక ఏమిటో తెలియని పరిస్థితి.
దీంతో పలువురు ఉద్యోగులు, పెన్షనర్లు ఇబ్బందులు పడ్డారు. కొంత మంది కోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడు జీతాలు చెల్లించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. రెండు నెలలకు కలిపి ఉద్యోగులకు దాదాపుగా ఐదు వేల కోట్ల వరకూ చెల్లించాల్సి రావొచ్చని అంచనా. అయితే.. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ ఆదేశాలను ఎంత మేర పట్టించుకుంటుందన్నది చూడాలి..!