ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో భారతీయ జనతా పార్టీ వైఖరి ఆ పార్టీలోనే క్లారిటీ లేకుండా పోయిందని… సోము వీర్రాజు ప్రమాణస్వీకారోత్సవంలోనే తేలిపోయింది. ఓ వైపు సోము వీర్రాజు.. సహా ఏ ఒక్క రాష్ట్ర నేత కూడా మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. మౌనం అర్థాంగీకారం అన్నట్లుగా నేతల తీరు సాగిపోయింది. దీనికి స్పష్టమైన కారణాలు ఉన్నాయి. అమరావతికి మద్దతుగా మాట్లాడిన వారిని.., పత్రికలకు వ్యాసాలు రాసిన వారిని… రైతుల దీక్షా శిబిరాలకు వెళ్లిన వారిని సోము వీర్రాజు.. సస్పెండ్ చేసి పడేస్తున్నారు. ఇప్పటికి.. ఐదారుగురు నేతల్ని ఆయన బాధ్యతలు చేపట్టక ముందే ఇంటికి పంపేశారు.
దాంతో.. చాలా మంది నేతలు.. అమరావతి గురించి నోరెత్తడానికి సిద్ధపడటం లేదు. సోము వీర్రాజు ప్రమాణస్వీకారంలోనూ ఆ ట్రెండ్ కనిపించింది. అయితే అనూహ్యంగా… బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. ఏపీ రాజకీయాల బాధ్యత మొత్తం తనదేనని చెప్పుకునే రామ్మాధవ్ మాత్రం.. స్టైల్ మార్చారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యూపీ లాంటి రాష్ట్రానికే మూడు రాజధానులు లేవు.. ఏపీకి ఎందుకుని ప్రశ్నించారు. అవినీతి కోసమే.. మూడు రాజధానులు పెడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం కల్పించుకోవాలంటే.. కల్పించుకోగలదని.. హైకోర్టులో అఫిడవిట్ తన పరిధి మేరకే వేసిందని.. ఆయన హింట్ కూడా ఇచ్చారు.
రామ్మాధవ్ ప్రసంగం తీరు బీజేపీ నేతల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇతర నేతలు అమరావతి రైతులకు న్యాయం గురించి.. పోరాటం గురించి మాట్లాడారు కానీ… మూడు రాజధానుల గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఓ వైపు రాష్ట్ర నాయకత్వాన్ని సస్పెన్షన్లు హెచ్చరికలతో పూర్తిగా కట్టడి చేస్తూ.. మరో వైపు రామ్మాధవ్ మాత్రం.. ఎందుకు అలా స్పందించారన్నదిఎవరికీ అర్థం కావడం లేదు. బీజేపీలో ఓ వర్గం మాత్రం.. రాజకీయం అలాగే ఉంటుందని… వైసీపీని పూర్తిగా సమర్ధిస్తున్నట్లుగా కాకుండా.., అప్పుడప్పుడు రామ్మాధవ్ లాంటి వాళ్లు విమర్శలు చేస్తారని.. కానీ.. సహకారం మాత్రం పూర్తి స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు. జరుగుతోంది అదే.
ఏపీలో బీజేపీ నేతలు.. ఎవరికి వారు తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. అది ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయిన సోము వీర్రాజుకు నచ్చితే పార్టీలో ఉంటారు. ఆయనకు నచ్చకపోతే సస్పెండ్ చేస్తారు. అంతే.. అనే సెటైర్లు బీజేపీలోనే వినిపిస్తున్నాయి.