ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టుల్లో కౌంటర్లు వేయడానికే ప్రత్యేకంగా అధికారిని నియమించింది. సీఆర్డీఏ బిల్లు రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులపై కోర్టుల్లో పిటిషన్లు పడ్డాయి. వాటిపై ఎప్పటికప్పుడు కౌంటర్లు దాఖలు చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. వాస్తవానికి చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఈ బాధ్యత తీసుకోవాల్సి ఉంది. అయితే.. ప్రత్యేకంగా శ్యామలరావు అనే సీనియర్ అధికారికి ఆ బాధ్యతలు ఇచ్చేశారు. ఇక నుంచి శ్యామల రావు… సీఆర్డీఏ బిల్లు రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లుల కోర్టుల్లో కౌంటర్లు వేసే బాధ్యతను తీసుకుంటారు. ఒక వేళ ఆయన సెలవు పెడితే.. ప్రత్యామ్నాయంగా మరో అధికారిని కూడా ముందే సిద్ధం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఎక్కువగా కోర్టుకు వెళ్తున్నాయి. చట్ట విరుద్ధంగా ఉంటున్నాయని.. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయని.. వాటి వల్ల ప్రభావితమయ్యే వారు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. వాటిని కోర్టులు కొట్టి వేస్తున్నాయి. ప్రభుత్వం తరపున పూర్తి సమాచారం కోర్టుకు ఇవ్వకపోవడం వల్లనే సమస్యలు వస్తున్నాయని.. ఏపీ పెద్దలు భావించారేమో కానీ.. కౌంటర్ల దాఖలుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకే.. ప్రత్యేక అధికారిని నియమించినట్లుగా తెలుస్తోంది.
మరో వైపు ఏపీ ప్రభుత్వం నియమించుకున్న న్యాయ సలహాదారులు.. న్యాయవాదుల పని తీరు.. ప్రభుత్వాన్ని నిరాశ పరుస్తోంది. వారు పిటిషన్లు కూడా సరిగ్గా వేయలేకపోతున్నారు. ఇక కోర్టులలో వాదనలు మాత్రం ఎంత సమర్థంగా వినిపించగలరని అసంతృప్తికి గురవుతున్నారు. గతంలో వరుస వ్యతిరేక తీర్పులు వస్తున్నాయని.. హైకోర్టులో కొంత మంది న్యాయవాదుల్ని తొలగించి కొత్తవారిని నియమించారు. సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు వేసేవారిని తొలగించారు. అయినా అదే సమస్య వచ్చింది. ప్రభుత్వం ఈ అంశంపై ప్రక్షాళన దిశగా ప్రయత్నించే అవకాశం ఉందని.. కౌంటర్ల దాఖలుకే ప్రత్యేక అధికారిని నియమించడంతో తెలుస్తోందని అంటున్నారు.