కొడుకైనా… కూతురైనా ఒక్కటే… ఇద్దరికీ ఆస్తిలో వాటా దక్కాల్సిందే… తండ్రి జీవించి ఉన్నా లేకపోయినా… కూతురు జీవించి ఉన్నా లేకపోయినా ఆస్థిలో కూతురుకు వాటా ఇవ్వాల్సందే… సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు సారాంశం ఇది. కుమార్తెలకు వారసత్వంగా ఆస్తిని పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తండ్రి జీవించి ఉన్నప్పటికీ.. లేనప్పటికీ.. ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది. కుమారులతో సమానంగా కుమార్తెలకు ఆస్తిలో వాటా ఉంటుందని తెలిపింది.
2005లో హిందూ వారసత్వ చట్టం-1956లో సవరణలు చేశారు. సవరణలతో కూడిన చట్టాన్ని 2005 సెప్టెంబర్ 9వ తేదీన పార్లమెంట్ ఆమోదించింది. తండ్రి సంపాదించిన ఆస్తిలో కుమార్తెలకు సమాన హక్కు ఉంటుందని ఇందులో పొందుపరిచారు. 1956 నాటి హిందూ వారసత్వ చట్టంలో సవరణలు చేపట్టే నాటికి కుటుంబంలో ఆడపిల్ల పుట్టినా, పుట్టకపోయినా.. ఈ సవరణ వర్తిస్తుందని స్పష్టం చేసింది. దీనికి ఎలాంటి కొలమానం లేదని స్పష్టం చేసింది. కుమార్తెకి ఆస్తి హక్కుపై భిన్న వాదనలను సుప్రీంకోర్టు తెర దించింది. ఇంట్లో ఆడపిల్ల ఉంటే చాలు.. ఆస్తిలో సమాన హక్కు ఉంటుందంటూ తాజాగా స్పష్టం చేసింది.
1980ల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు సమాన ఆస్తి హక్కును కల్పిస్తూ ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఇది అమలవుతోంది. కుటుంబ పరంగా.. అందరూ కలిసి వివాదాల్లేకుండా ఆస్తులు పంచుకుంటూ వస్తున్నారు. ఎక్కడైనా వివాదాలు ఏర్పడితే న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. అక్కడ కుమార్తెలకూ .. హక్కులు దక్కుతున్నాయి. ఇప్పుడు… అన్నింటిలోనూ సగం అంటున్న మహిళాలోకానికి ఇప్పుడు ఆస్తిలోనూ సగం అని.. సుప్రీంకోర్టు అభయం ఇచ్చేసినట్లయింది.