హీరోలకు దర్శకులుగా మారాలని ఉంటుంది. ఎందుకంటే.. చాలా వరకూ.. సహాయ దర్శకులుగా పనిచేసి వచ్చినవాళ్లు ఎక్కువగా కనిపిస్తారు. కథల విషయంలో వాళ్లకు పట్టుఉంటుంది. అందుకే.. ఒక్కసారైనా మెగాఫోన్ పట్టాలని అనుకుంటారు. కథానాయికలు అలా కాదు. వచ్చామా? డబ్బులు సంపాదించుకున్నామా? వెళ్లిపోయామా? అనుకుంటారు. కనీసం.. ప్రొడక్షన్‌లో కూడా దిగరు. అది ఇంకా రిస్క్ అని వాళ్లకు తెలుసు. కానీ.. కొంతమంది కథానాయికలు అలా కాదు. మనసులో `దర్శకత్వ` ఆలోచన బలంగా ముద్ర వేసుకుని ఉంటుంది. నిత్యమీనన్ కి మెగాఫోన్ పట్టాలని కల. అందుకు ప్లానింగ్ కూడా చేస్తోంది.
ఇప్పుడు అదే బాటలో నివేదా థామస్ పయనించబోతోంది. నిన్నుకోరి, జెంటిల్‌మెన్ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది నివేదా. ఇప్పుడు.. `వి`లోనూ నటించింది. త్వరలోనే దర్శకత్వం వహించాలని భావిస్తోందట. “దర్శకత్వం అన్నది నా కల. ఎప్పటికైనా మెగాఫోన్ పడతాను. అందులోని మెళకువలపై దృష్టి పెడుతున్నా“ అంటోంది నివేదా. కాకపోతే మరో రెండు మూడేళ్లు కేవలం నటనపైనే దృష్టి పెట్టాలనుకుంటోందట. ఆ తరవాతే కెప్టెన్ కుర్చీలో కూర్చుంటుందట. మరి… నివేదా దర్శకత్వ ప్రతిభ ఎలా ఉంటుందో తెలియాలంటే అప్పటి వరకూ ఆగాల్సిందే.