విజయవాడ అగ్నిప్రమాద ఘటనలో డాక్టర్లను అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉత్సాహం చూపిస్తూండటం తీవ్రంగా విమర్శల పాలవుతోంది. రమేష్ ఆస్పత్రి చైర్మన్ పోతినేని రమేష్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఆయన పరారీలో ఉన్నారని మీడియాకు లీకులు ఇస్తున్నారు. ఆయన కోసం హైదరాబాద్‌లోనూ వెదుకుతున్నామని చెబుతున్నారు. అలాగే స్వర్ణా ప్యాలెస్ ఓనర్‌నూ అరెస్ట్ చేస్తామని ఆయన కూడా.. పరారీలో ఉన్నారని చెబుతున్నారు. డాక్టర్ రమేష్ బాబు విషయంలో ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వైద్యుల ఆగ్రహానికి కారణం అవుతోంది. ఆయనను అరెస్ట్ చేయవద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డీజిపికి లేఖ రాసింది. ఇప్పటికే రమేష్ ఆసుపత్రికి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు.
అన్ని సౌకర్యాలు ఉండి.. అనుమతులు వచ్చిన తర్వాతనే… స్టార్ రేటింగ్ ఉన్న హోటల్స్ ను క్వారంటైన్ సెంటర్లుగా మార్చారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చెబుతోంది. క్వారంటైన్ సెంటర్లలో పేషంట్లకు ట్రీట్మెంట్ మాత్రమే ఆస్పత్రి బాధ్యతని.. మిగతా సౌకర్యాలు మొత్తం హోటల్ మేనేజ్మెంట్ బాధ్యతని గుర్తు చేశారు. వైద్యులను అరెస్ట్ చేయడం, సహజ న్యాయ సూత్రాలకు విరుద్దమని గుర్తు చేశారు. కార్డియలజిస్ట్ అసోసియేషన్ కూడా ఇదే అంశంపై మరో లేఖను ముఖ్యమంత్రికి పంపింది. రమేష్‌బాబును అరెస్ట్ చేయాలనుకోవడం సరికాదని తెలిపింది. మరో వైపు… రమేష్‌బాబును రమేష్ చౌదరి అంటూ.. చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి దగ్గర్నుంచి అందరూ.. విమర్శలు చేశారు. అయన చంద్రబాబుకు దగ్గర అని తేల్చేశారు.
మరో వైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు.. హోటల్‌కు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని తేల్చారు. అయితే అనుమతులకు తగ్గట్లుగా ఏర్పాట్లు లేవని నివేదికలు సిద్ధం చేశారు. అనుమతులిచ్చేసి అధికారులు చేతులు దులిపేసుకున్నారని, కనీసం క్వారంటైన్ సెంటర్ల నిర్వహణపై ఎటువంటి నిఘా ఉంచలేదని రిపోర్టులు సిద్ధం మచేసినట్లుగా చెబుతున్నారు. రమేష్ ఆస్పత్రి విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు.. ఇక కరోనా రోగల్ని చేర్చుకోవాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.