హైకోర్టును..న్యాయమూర్తుల విశ్వసనీయతను దెబ్బతీసేందుకు భారీ కుట్ర జరిగిందన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణకు హైకోర్టు ఆదేశించింది. కొద్ది రోజుల క్రితం… హైకోర్టును రెడ్ జోన్‌గా ప్రకటించాలని…. రిజిస్ట్రార్ జనరల్‌గా ఉన్న రాజశేఖర్ మరణంపై విచారణ చేయించాలని.. ఓ బీసీ సంఘం పేరుతో పిటిషన్ దాఖలయింది. అంతకు ముందు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై వివిధ రకాల ఆరోపణలు చేస్తూ రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఆ కుల సంఘానికి హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య వ్యవస్థాపకునిగా ఉన్నారు. అదే సమయంలో.. ఈశ్వరయ్య.. సస్పెన్షన్‌లో ఉన్న జడ్జి రామకృష్ణతో ఫోన్ సంభాషణలు వెలుగులోకి వచ్చాయి.
రామకృష్ణను ప్రలోభపెట్టి .. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేయించేందుకు ప్రణాళిక సిద్దం చేసినట్లుగా ఆ ఆడియో టేపులు ఉన్నాయి. కుట్రను కనిపెట్టిన రామకృష్ణలో హైకోర్టులో పిటిషన్ వేశారు. అంతకు ముందు హైకోర్టును రెడ్ జోన్ గా ప్రకటించాలని.. మరణించిన రాజశేఖర్ మృతిపై విచారణ జరిపించాలన్న పిటిషన్లో తాను ఇంప్లీడ్ అవుతానని కోరారు. ఈ పిటిషన్లోనే ఈశ్వరయ్య న్యాయవ్యవస్థపై చాలా పెద్ద కుట్ర చేశారని… ఆయన వెనుక చాలామంది పెద్దలు ఉన్నారని..దీనిపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపితేనే అసలు విషయం బయటకు వస్తుందని రామకృష్ణ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. ప్రభుత్వం మాత్రం… అలాంటి విచారణ అవసరం లేదని… ఈ కేసులో రామకృష్ణకు సంబంధం లేదని వాదించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మానసం.. కుట్ర తేలాల్సిందేనని నిర్ణయించింది. విచారణ అధికారిగా మాజీ న్యాయమూర్తి ఆర్.వి.రవీంద్రన్ ను నియమించింది. రవీంద్రన్‌కు సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ అధికారులు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుల వెనుక ఉన్న కేట్రను చేధించాలని… 4 వారాల్లో నివేదికను అందించాలని హైకోర్టు రవీంద్రన్‌ను ఆదేశించింది. ఈశ్వరయ్య ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పదవిలో ఉన్నారు. ఆయన ఏపీ ప్రభుత్వ పెద్దల కోసమే..న్యాయవ్యవస్థను టార్గెట్ చేసినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.