అమరావతి భవనాల నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష జరిపారు. ఆ కట్టడాలు పూర్తి చేయడానికి అవసరమైన నిధుల సమీకరణ చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. అమరావతి మెట్రోపాలిటిన్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన అధికారులతో జరిపిన సమావేశంలో…అమరావతిలో నిర్మాణాలు ఏయే దశల్లో ఉన్నాయో జగన్ తెలుసుకున్నారు. నిర్మాణాలు పూర్తి చేసే కార్యాచరణపై అధికారులతో చర్చించారు. నిధుల సమీకరణకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్థికశాఖ అధికారులతో కలిసి కూర్చుని ప్లాన్ చేసుకోవాలన్నారు. హ్యాపీనెస్ట్ బిల్డింగ్లను కూడా పూర్తి చేయాలన్నారు.
సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అమరావతిలో జరుగుతున్న నిర్మాణ కార్యకలాపాలన్నింటినీ నిలిపివేశారు. పధ్నాలుగు నెలల నుంచి అమరావతిలో ఒక్క ఇటుక కూడా పడలేదు. మధ్య మధ్యలో సమీక్షలు చేస్తున్నట్లుగా మీడియా ప్రకటనలు .. భవనాల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలనే ఆదేశాలు ఇచ్చినట్లుగా ప్రెస్నోట్లు వస్తూ ఉన్నాయి. అప్పుడప్పుడు బొత్స సత్యనారాయణ అమరావతిలో ఉన్న భవనాలను చూసి వస్తూంటారు. కానీ ఇంత వరకూ ఒక్కటంటే ఒక్క అడుగు ముందుకు పడలేదు. కానీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరిలించే ఏర్పాట్లు మాత్రం చేసుకున్నారు.
హ్యాపినెస్ట్ ప్రాజెక్ట్ ను సీఆర్డీఏ చేపట్టింది. అది అమరావతిలో ఫ్లాట్లు కొనుగోలు చేయాలనుకునేవారి కోసం..సీఆర్డీఏ నిర్మించ తలపెట్టిన ప్రాజెక్ట్. బుకింగ్స్ ప్రారంభించిన గంటల్లోనే ప్లాట్లన్నీ బుక్కయిపోయాయి. పునాదులు వేయక ముందే..ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు అక్కడ రాజధాని లేకపోవడంతో.. ఫ్లాట్లను బుక్ చేసుకున్న వారు తమ డబ్బులు తాము వెనక్కి ఇచ్చేయాలని అంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం కట్టిస్తామని అంటోంది. ఇప్పటికే టెండర్లను కూడా రద్దు చేసేసింది. మరోసారి రివర్స్ టెండర్లకు వెళ్లింది. ఏ కాంట్రాక్టరూ ముందుకు వచ్చినట్లుగా లేదు. దాంతో పనులు ప్రారంభం కాలేదు.