నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు జగన్ సర్కార్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం ఒక్క కులం మాత్రమే బాగుపడుతోందని మిగతా అన్ని కులాలను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంలో రెడ్ టేపిజం లేదు..రెడ్డియిజం వచ్చిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విగ్రహాలు నిర్మించేందుకు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని… రాష్ట్రంలో ఇప్పటికే కులం ఫీలింగ్ చాలా వచ్చేసింది.. అది పోగొట్టుకోవాల్సిన అవసరం ఉందని జగన్‌కు హితవు పలికారు. అన్ని కులాల ఓట్లు వేయించుకుని ఇప్పుడు ఒకే కులానికి ఎందుకు ప్రాధాన్యం ఇస్తారని ప్రశ్నించారు. క్రైస్తవంలో ఉన్న జగన్ అధికారంలోకి వస్తే.. కుల ప్రస్తావన ఉండదని ప్రజలు భావించారన్నారు.
కానీ పరిస్థితి భిన్నంగా ఉందని… నామినేటెడ్ పదవులు, యూనివర్సిటీ వీసీలతో సహా అన్ని పదవులకు రెడ్లనే నియమిస్తున్నారని విమర్శించారు. ప్రతి రెండ్రోజులకు ఒక రెడ్డిగారి నియామకం జరుగుతోందన్నారు. ప్రభుత్వం నియమించిన రెడ్డిల జాబితా చాంతాడంత ఉందని.. రాష్ట్రంలో ఇంకో కులమే లేదా అని ఎంపీ ప్రశ్నించారు. పలుకుబడి ఉన్న పదవులు రెడ్డిలకు ఇచ్చి.. పనికిరాని పదవులు బలహీనవర్గాలకు ఇస్తారా అని నిలదీశారు. రఘురామకృష్ణరాజు.. ఒక్క సారిగా కులం కోణంలో తీవ్ర విమర్శలు చేయడానికి కారణం వైసీపీ సోషల్ మీడియా ఆయనపై చేస్తున్న ఆరోపణలే.
రఘురామకృష్ణరాజును వ్యక్తిగతంగా దూషిస్తూ.. వైసీపీకి చెందిన గుర్రంపాటి దేవందర్ రెడ్డి అనే వ్యక్తి పోస్టులు పెడుతున్నారు. అయితే.. ఈ దేవేందర్ రెడ్డి ప్రజాధనం జీతంగా తీసుకుంటూ.. ఏపీ ప్రభుత్వ డిజిటల్ డైరక్టర్‌గా ఉన్నారు. దీంతో ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ.. పార్టీకి సోషల్ మీడియాలో ఎలా పనిచేస్తారని రఘురామకృష్ణరాజు మండిపడుతున్నారు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ.. తనను దూషిస్తున్న దేవేందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోకుంటే.. సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. గుర్రంపాటి దేవందర్ రెడ్డి వివరాలన్నీ తెలుసుకున్న రఘురామకృష్ణరాజు..తాను నిలబడితే తన బొడ్డు వరకు రాడని… మండిపడ్డారు.