ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం కొన్ని సమీక్షలు చేశారు. వాటిలో అత్యంత ముఖ్యమైనవి అని.. అక్కడి పీఆర్ టీం నుంచి మీడియాకు వచ్చిన సందేశాల్లో ఉన్న వి ఒకటి దిశ చట్టం అమలుపై ముఖ్యమంత్రి సమీక్ష, రెండోది అమరావతి మెట్రోపాలిటిన్ ప్రాంత అభివృద్ధి చట్టంపై సమీక్ష. చాలా సీరియస్గా సమీక్షలు జరిగాయని దిశ చట్టం అమలుకు ఇంకా ఎలా మెరుగైన చర్యలు తీసుకోవాలో చెప్పారని… అమరావతి ప్రాంతాన్ని ఎలా అమ్మేయాలో కూడా… సూచించారని.. తర్వాత ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. చాలా మంది ఆహా.. ఓహో అనుకున్నారు కానీ… కొంత మందికి మాత్రం.. ఇదేం విచిత్రం అనుకోలేని పరిస్థితి. ఎందుకంటే అమలు ఎలా ఉంది అని ముఖ్యమంత్రి సమీక్షించిన ఆ రెండు చట్టాలు ఇంకా అమల్లోకి రాలేదు మరి.
ఆంధ్రప్రదేశ్లో లెక్కకు మిక్కిలిగా అత్యాచార ఘటనలు జరిగినా.. ఏపీ సర్కార్లో పెద్దగా కదలిక రాదు కానీ.., పొరుగు రాష్ట్రంలో దిశ ఘటన జరగగానే… ఆడబిడ్డలకు న్యాయం చేస్తానని దిశ చట్టం తీసుకొచ్చేశారు. 21 రోజుల్లో నిందితుడికి ఉరి అని అసెంబ్లీలో ఆవేశపడ్డారు. కానీ.. ఓ చట్టం అమల్లోకి రావాలంటే.. రాష్ట్రపతి ఆమోదముద్రపడాలి. ఇంత వరకూ.. అలాంటి అమోదముద్ర రాష్ట్రపతి నుంచి పడలేదు. ఆ చట్టం సహజంగానే ఏపీ సర్కార్ .. చట్ట వ్యతిరేకంగా చేసిందనే అనుమానాలతో అక్కడ ఆగిపోయింది. కానీ.. ఇక్కడ దిశ చట్టం అమల్లోకి వచ్చేసిందన్న భావనను ప్రజల్లో కల్పించడానికి ప్రభుత్వ పెద్ద ఏ మాత్రం సందేహించడం లేదు. దిశ పోలీస్ స్టేషన్లు పెట్టేశారు…దిశ చట్టం అమలుపై సమీక్షలు కూడా చేస్తున్నారు. చట్టమే లేనప్పుడు సమీక్ష ఎలా చేస్తారనేది.. మౌలికంగా వచ్చే ప్రశ్న.
ఇక క్యాపిటల్ రీజియన్ డెలవప్మెంట్ అధారిటీ.. సీఆర్డీఏను రద్దు చేసేసిన ఏపీ సర్కార్ అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెలవప్ మెంట్ అధారిటీని ఏర్పాటు చేసింది. అసెంబ్లీలో చట్టం అయింది. గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేశారు. కానీ కోర్టులో స్టేటస్కో ఉంది. దాంతో అమల్లోకి రాలేదు. అయినప్పటికి.. ఏఎంఆర్డీఏ మీద జగన్ సమీక్ష చేసేశారు. ఇందులో.. అమరావతి భవనాలను … ఎలా అమ్మాలి.. భూమితో సహా అమ్మాలా.. లేక భూమి, భవనాలు కలిపి అమ్మేయాలా అన్న చర్చ జరిపినట్లుగా బయటకు సమాచారం పంపారు. అసలు లేని చట్టంపై ఎలా సమీక్ష చేస్తారనేది మరికొంత మందికి వచ్చే సందేహం.
ఆంధ్రప్రదేశ్లో అన్నీ సాధ్యమే. అమల్లోకి రాని చట్టాలపై సమీక్షిస్తారు. అమల్లో ఉన్న చట్టాలను ఒక్క పార్టీకి.. ఒక్క సామాజికవర్గానికి తప్ప.. అందరికీ అన్వయింప చేస్తారనే సెటైర్లు ఇందుకే పడుతూంటాయి.