న్యాయవ్యవస్థపై.. న్యాయమూర్తులపై కుట్ర జరిగినట్లుగా ఏపీ హైకోర్టు ఓ అభిప్రాయానికి వచ్చింది. మాజీ హైకోర్టు న్యాయమూర్తి ఈ కుట్రలో పాత్రధారిగా హైకోర్టులో జడ్జి రామకృష్ణ సమర్పిచిన ఆడియో టేప్ నిర్ధారిస్తోంది. ఆయన ఆ వాయిస్ తనదేనని అంగీకరించారు కూడా. ఇప్పుడు.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో హైకోర్టు విచారణకు ఆదేశించడంతో .. అందరి దృష్టి ఈశ్వరయ్యపై కాకుండా.. ఈశ్వరయ్య వెనుక ఎవరున్నారన్న అంశంపై పడుతోంది. తెలంగాణకు చెందిన ఈశ్వరయ్యకు న్యాయమూర్తిగా రిటైరైన తర్వాత ఏపీలో రాజకీయం చేశారు. కులసంఘం పెట్టి ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. టీడీపీ ఓడిపోయిన తర్వాత జగన్ ప్రభుత్వం ఆయనకు ప్రత్యేకంగా ఓ కమిషన్ ఏర్పాటు చేసి పదవి ఇచ్చింది. ఇప్పుడాయన ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడు.
అయితే.. న్యాయవ్యవస్థపైనా.. న్యాయమూర్తులపైనా.. నిందలు వేయించాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన మరెవరి కోసమో.. న్యాయవ్యవస్థను టార్గెట్ చేయాలనకున్నారని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. కొన్ని వ్యవస్థల్ని టార్గెట్ చేసినప్పుడు.. వాటిపై ఆరోపణలు చేయించి.. వాటి విశ్వసనీయతను తమ మీడియా ద్వారా దెబ్బతీయడమే .. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వ్యూహం అనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఓ సామాజికవర్గంపై వ్యతిరేక ప్రచారం దగ్గర్నుంచి అచ్చెన్నాయుడుపై అవినీతి ముద్ర వరకూ అలాంటి ఆరోపణలు చేయించి.. లబ్ది పొందారని.. ఇప్పుడు అదే తరహాలో న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేయించేందుకు సిద్ధమయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈశ్వరయ్య కూడా తన టేపుల్లో జగన్ ప్రస్తావన తీసుకు వచ్చారు. అందుకే.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చేయబోయే విచారణలో బయటపడే అంశాలపై ఆసక్తి వ్యక్తమవుతోంది.
తమ వ్యవస్థపైనే రాజకీయంగా .. కుట్ర పూరితంగా గురిపెట్టిన అంశాన్ని న్యాయవ్యవస్థ అంత తేలిగ్గా విడిచి పెట్టే అవకాశం లేదు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తికి.. సీబీఐ, విజిలెన్స్ సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పుడు.. ఈశ్వరయ్య.. వేసిన పిటిషన్ల వెనుక ఎవరున్నారు..? ఏ ఉద్దేశంతో వేశారు..? అన్న విషయాలు బయట పెట్టడం పెద్ద విషయం కాదు. ఈశ్వరయ్య కాల్ లిస్ట్ బయటకు లాగితే… ఆయన వెనక ఉన్నదెవరో తేలిపోతుంది. అదే ఇప్పుడు ఏపీలో కొంత మందికి వణుకు పుట్టిస్తోంది.