ఓటీటీలు పెరిగాక.. కంటెంట్‌కి ప్రాధాన్యం ఏర్పడింది. కథల కోసం అన్వేషణ మొదలైంది. పాత కథలకూ పని దొరికింది. అందులో భాగంగా మహమ్మద్ ఖదీర్‌బాబు రాసిన `మెట్రో కథలు` తెరపైకొచ్చే ఆస్కారం ఏర్పడింది. నగర జీవితాల్ని, అందులో ఉన్న ఆటు పోట్లనీ, మనస్తత్వాల్నీ, కోల్పోతున్న విలువైన జ్ఞాపకాల్నీ అద్దం పట్టాయి మెట్రో కథలు. పాఠక లోకం నుంచి ఖదీర్ బాబు ప్రయత్నానికి గొప్ప గుర్తింపు దక్కింది. ప్రశంసలు అందాయి. వాటిలో నాలుగు కథల్ని ఏరి … మెట్రో కథలు అనే వెబ్ ఫిల్మ్ ని రూపొందించారు. `పలాస`తో ఆకట్టుకున్న కరుణ కుమార్ వీటికి దర్శకత్వం వహించారు. ఆహాలో ఈరోజు నుంచి `మెట్రో కథలు` చూడొచ్చు. మరి ఆ నాలుగు కథల మాటేంటి? పాఠక లోకాన్ని ప్రేరేపించిన మెట్రో కథలు తెరపై ఎలా ఉన్నాయి?
ప్రపోజల్, ఘటన, సెల్ఫీ, తేగలు…. ఇవి నాలుగూ నాలుగు నేపథ్యాల్లో సాగే కథలు. ఓ మధ్యతరగతి అమ్మాయికి లవ్ ప్రపోజల్ వస్తే.. ఆమె ఎలా స్వీకరించింది? అనేది ప్రపోజల్ కథ. భర్తంటే కోపం, చిరాకు, అసహ్యం అనుకునే ఓ గృహిణి – అదే భర్తకు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించిందో `ఘటన` చెబుతుంది. కెరీర్ పరుగులు, గోల్స్ మాయలో… ఎవరెవరు ఏం కోల్పోతున్నారో `సెల్ఫీ` అద్దం పడుతుంది. నాన్న జ్ఞాపకాల్లో మునిగిన ఓ కొడుకు కథ `తేగలు` చెబుతుంది. కథలుగా నాలుగూ అలరించినవే. అవన్నీ ఇప్పుడు తెరపైకొచ్చాయి.
కథ చదవడం వేరు, దాన్ని తెరపై చూపించడం వేరు. పాఠక లోకాన్ని ఊపేసిన కథల జోలికి వెళ్లడం మరింత ప్రమాదం. కథలు చదువుతున్నప్పుడు ప్రేక్షకుడు ఒక రకమైన ఊహాలోకాన్ని నిర్మించుకుంటాడు. రచయిత ఓ పాత్రని మరింత బలంగా ప్రేక్షకుడిలో నాటుకుపోవడానికి తగినన్ని కసరత్తులు చేస్తాడు. తన దగ్గర కావల్సినంత టైమ్ ఉంటుంది. కానీ దర్శకుడికి ఇవేం ఉండవు. ప్రేక్షకుడు వేరు, పాఠకుడు వేరు. ఈ అంతరాన్నిగమనించినప్పుడే… కథలు వెండి తెరపై సన్నివేశాలుగా సక్సెస్ అవుతాయి. ఆ ఆంతర్యాన్ని దర్శకుడు కరుణ కుమార్ కొంత వరకూ గ్రహించాడు. తేగలు, సెల్ఫీ కథల్ని దర్శకుడు అర్థం చేసుకున్నంతగా ప్రపోజల్, ఘటన అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది. సెల్ఫీతో పోలిస్తే… తేగలు మనసుకు దగ్గర అవుతుంది. ప్రపోజల్ చూస్తే… ఇందులో ఏముంది? అనిపిస్తుంది. ఘటన, సెల్పీల్లో స్త్రీ పాత్రల్ని చూపించిన విధానం చూస్తే దర్శకుడిపై కోపం వస్తుంది. నిజానికి ఆయా కథలు చదువుతున్నప్పుడు ఆ ఫీలింగ్ పాఠకుడికి రాదు. అక్కడ కథకుడిగా స్త్రీ పాత్రలవైపు వకాల్తా పుచ్చుకుని మాట్లాడాడు ఖదీర్ బాబు. కానీ అవే కథలు తెరపైకొస్తే తప్పులు కనిపిస్తాయి. ఘటన ఎపిసోడ్ లో చూస్తే క్షణికావేశానికి గృహిణి ఎలా లొంగిపోయింది? అనిపిస్తుంది. ఆ తరవాత ఆమెలో గిల్టీ ఫీలింగ్ కూడా కనిపించదు. సెల్ఫీలోనూ అంతే. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త.. గోల్స్ పేరుతో, కెరీర్ పేరుతో, బెంగళూరు వెళ్లి ఉద్యోగం చేసుకుంటుంటే.. భార్య పరాయి మగాడితో.. ఓ హోటెల్ రూమ్ వరకూ ఎలా రాగలదు? అనే ప్రశ్నలు ఉదయిస్తాయి. మొత్తంగా చూస్తే… కథలు చదువుతున్నప్పుడు కలిగిన అనుభూతి.. వాటిని తెరపై చూస్తున్నప్పుడు కలగదు.
నటీనటుల్లో సన, రాజీవ్ కనకాల ఆకట్టుకుంటారు. రాజీవ్ అయితే… మరింతగా గుర్తిండిపోతాడు. అలాగని మిగిలిన వాళ్లు తక్కువ చేశారని కాదు. ఎవరి పాత్రల్లో వాళ్లు పర్ఫెక్ట్గా ఒదిగిపోయారు. నగర జీవితం పేరుతో, ఏం కోల్పోతున్నామో చెప్పే కథలు మెట్రోలో కనిపిస్తాయి. ఆకథలు చదివిన వాళ్లకు కాస్త వెలితిగా ఉన్నా, వాటితో పరిచయం లేనివాళ్లకు సెల్ఫీ, తేగలు మాత్రం నచ్చుతాయి.
మొత్తానికి తెలుగు సాహిత్యంలోని అత్యుత్తమ కథల్ని ఇలా క్కూడా వాడుకోవొచ్చన్న భరోసా `మెట్రో` కథలు అందించాయి. ఇది ప్రారంభం మాత్రమే. మరిన్ని మంచి కథలు… వెబ్ వేదికగా సాక్షాత్కరించాలి. కాకపోతే… దర్శకుడు కాస్త కథకుడి, పాఠకుడి దృష్టి కోణంలోంచి ఆలోచించగలగాలి. తెరపై కూడా అర్థవదంగా ఉండగలిగే కథల్ని ఎంచుకోవాలి. అదొక్కటే కత్తి మీద సాము.