తెలంగాణలో ఆరు నెలల్లో ఉపఎన్నిక రావడం ఖాయంగా కనిపిస్తోంది. కొద్ది రోజుల కిందట దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందారు. అయితే..తెలంగాణలో నిన్నామొన్నటి వరకు ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే..వారి కుటుంబసభ్యులను ఏకగ్రీవంగా గెలిపించుకునే సంస్కృతి ఉండేది. కానీ కేసీఆర్ ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. గతంలో పాలేరు.. ఆ తర్వాత నారాయణఖేడ్ ఉపఎన్నికల్లో అభ్యర్థుల్ని నిలబెట్టి ఘన విజయం సొంతం చేసుకున్నారు. అందుకే.. అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ కానీ..ఎన్నికను లైట్ తీసుకోవాలని అనుకోవడం లేదు.
నిజానికి టీఆర్ఎస్లో కన్నా…కాంగ్రెస్‌లోనే దుబ్బాక ఉపఎన్నికలపై ఎక్కువ చర్చ జరుగుతోంది. కొంత మంది సొంత అభిప్రాయాలను చెప్పడం ప్రారంభించారు. జగ్గారెడ్డి లాంటి నేతలు… రామలింగారెడ్డి కుటుంబసభ్యులను నిలబడితే సహకరిస్తామని కూడా చెప్పారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి వీటన్నింటికి తెర దించారు. దుబ్బాకలో పోటీ చేసి తీరుతామని.. ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తాను చెప్పేదే ఫైనల్ అని…ఇతరులు చెప్పేది వ్యక్తిగత అభిప్రాయాలేనని తేల్చేశారు.
మరో వైపు బీజేపీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. అక్కడ నుంచి గతంలో పోటీ చేసిన రఘునందన్ రావు..ఈ సారితన ప్రయత్నాలను ప్రారంభించేశారు కూడా. అయితే…కాంగ్రెస్‌లోనే ఎప్పట్లానే గందరగోళం కనిపిస్తోంది . త్వరలో కొత్త పీసీసీ అధ్యక్షుడు వస్తే… ఆయన పట్టు సాధిస్తే తప్ప.. ఈ తరహా గందరగోళం మారే అవకాశం లేదు.