గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని .. చెన్నైలో ఆయన చికిత్స పొందుతున్న ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఆయనను ఐసీయూలోకి షిఫ్ట్ చేశామని .. లైఫ్ సపోర్ట్ యంత్రాలు అమర్చామని ఎంజీఎం ఆస్పత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో తెలిపారు. ఎస్పీ బాలుకు ఐదో తేదీన కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయింది. వైద్యులు హోం ఐసోలేషన్లో ఉండమని సూచించినా… కుటుంబభ్యులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తానే ఆస్పత్రిలో చేరినట్లుగా అప్పుడే ఓ వీడియో విడుదల చేశారు.
తన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని బాలసుబ్రహ్మణ్యం వీడియోలో ప్రకటించారు. అప్పటి నుండి ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోలుకున్నట్లుగా కనిపించినా.. నిన్న సాయంత్రం హఠాత్తుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అత్యవసర చికిత్స ప్రారంభించారు. నిపుణులైన డాక్టర్ల బృందాన్ని ఎస్బీ బాలు చికిత్స కోసం.. నియమించినట్లుగా ఆస్పత్రి ప్రకటించింది.
కరోనా కారణంగా దేశంలో మరణ మృదంగం చోటు చేసుకుంటోంది. ఎంత మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యల కారణంగా కరోనా ప్రాణాంతకంగా మారుతోంది. కరోనా సోకే వరకూ యాక్టివ్గా ఉన్న కొంత మంది..సోకిన తర్వాత నాలుగైదు రోజుల్లోనే విషమ స్థితికి వెళ్తున్నారు. తన పాటలతో ఎంతో మందికి మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదించిన ఎస్పీ బాలు.. కోలుకుని ఆరోగ్యంగా రావాలని.. ఆయన మళ్లీ పాటలు పాడాలని..సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు పెడుతున్నారు.