ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలు రావడంతో.. యావత్ చిత్రసీమ ఉలిక్కిపడింది. ఆయన ఆరోగ్యం బాగుండాలని, క్షేమంగా తిరిగిరావాలని అభిమానులంతా ప్రార్థించారు. ఆ ప్రార్థనలు ఫలిస్తున్నాయి. బాలు ఆరోగ్యం క్రమంగా కుదుట పడుతోంది. గురువారం ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో… వైద్యులు ఐసీయూలో చేర్చారు. అప్పటితో పోలిస్తే….శుక్రవారం రాత్రి ఆయన పరిస్థితి కొంచెం మెరుగయ్యింది. బాలు కోలుకుంటున్నారని, చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని బాలు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం గురించి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఆయన త్వరగా కోలుకుంటారని, ఇది వరకటిలా పాటలు పాడి అలరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు వెంకయ్య నాయుడు.