రాజ్యాంగం, చట్ట ప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవ సందేశం ఇచ్చారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి… ప్రసంగించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం, చట్టం ప్రకారం నడుచుకోవడం గురించి మాత్రమే కాకుండా… మూడు రాజధానుల గురించి కూడా సంకల్పాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన గాయం మళ్లీ మళ్లీ కాకుండా ఉండాలంటే.. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాల్సి ఉందని.. . వికేంద్రీకరణే సరైన విధానం అని తేల్చి చెప్పారు. అందుకే సమన్యాయం జరిగేలా మూడు రాజధానుల బిల్లును చట్టంగా మార్చామన్నారు.
త్వరలో విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని, కర్నూలు కేంద్రంగా న్యాయరాజధాని ఏర్పాటుకు పునాదులు వేస్తామని స్పష్టం చేశారు. తమ పాలనలో రాజ్యాంగం మొదటి పేజీలో రాసిన జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే పదాలకు నిజమైన అర్థం చెబుతున్నామని జగన్ ప్రకటించారు. తాము చేపట్టే పథకాలన్నీ ప్రజల్ని పేదరిక నుంచి బయటపడేసేందుకేననన్నారు. అందరికీ ఇంగ్లిష్ మీడియం చదువు చెప్పేందుకు ప్రయత్నిస్తూంటే.. కొందరు అడ్డుకుంటున్నారని జగన్ వేదికపై నుంచి ఆరోపించారు.
అనూహ్యంగా ప్రత్యేకహోదా అంశాన్ని కూడా జగన్ తన ఇండిపెండెన్స్ డే స్పీచ్‌లో ప్రస్తావించారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్రప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా అమలు చేయాలని గట్టిగా అడుగుతూనే ఉంటామని ప్రకటించారు. అయితే.. అదే సమయంలో ఇప్పటికిప్పుడు హోదా ఇచ్చే అవకాశం లేదని కూడా చెప్పారు. భవిష్యత్తులో అయినా పరిస్థితులు మారి, కేంద్రం మనసు మారి ప్రత్యేక హోదా ఇస్తుందని అనుకుంటున్నామని.. అప్పటి వరకూ కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామన్నారు. హోదా అంశం మళ్లీ సెంటిమెంట్ అయితే.. తాము ఎప్పటికైనా సాధిస్తామన్నట్లుగా జగన్ చెప్పుకొచ్చారు.