రాజకీయ విశ్లేషణల్లో అంతరార్థాలను తనదైన శైలిలో కొత్తపలుకులో ప్రస్తావించే ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరక్టర్ వేమూరి రాధాకృష్ణ …ఈ సారి ఎప్పట్లాగే జగన్ నిర్ణయాలపైనే గురిపెట్టారు. తెలంగాణలో వ్యవహారాలన్నీ చెప్పుకోవాల్సినంతగా మారడం లేదు. కానీ ఏపీలో అలా ఉండటం లేదు. ఇప్పుడు నేరుగా న్యాయవ్యవస్థపైనే గురి పెట్టిన వ్యవహారం కలకలం రేపుతోంది. న్యాయవ్యవస్థపై కుట్రలు బయట పెడుతున్నామని.. వాటికి సంబంధించిన వార్తలను ఆంధ్రజ్యోతి ప్రాధాన్య క్రమంలో ప్రసారం చేస్తోంది. మొన్నటి జడ్జి రామకృష్ణ బయట పెట్టిన ఆడియో టేపు… నిన్నటి న్యాయమూర్తులపై నిఘా కథనాలు అన్నీ.. అందులో భాగమే. అయితే.. ఏదీ తీసి పారేయడానికి లేదు. పక్కాగా నిర్ధారించుకున్న తర్వాతనే… ఆ కథనాలు ఉన్నాయని… అందులో రాసిన విధానం… ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి.
దేశంలో ఇంత వరకూ ఎవరూ న్యాయవ్యవస్థపై గురి పెట్టలేదు. మొదటి సారి ఆ ఘనత.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే సాధిస్తోందని.. ఆర్కే వెటకారం చేస్తున్నారు. ఈ విషయం ఇంతటితో ఆగదని… ఇతర రాజకీయ నేతల మీద నిఘా పెట్టినట్లుగా.. న్యాయమూర్తులపై పెడితే.. తప్పించుకోవడానికి అవకాశం ఉండదని పరోక్షంగానే హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వానికి .. హైకోర్టుకు ఎక్కడ చెడిందనేదానిపైనా.. ఆర్కే భిన్నమైన విశ్లేషణ చేశారు. తాను 30 ఏళ్లు సీఎంగా ఉంటాను.. మీరెంత నాలుగైదేళ్లు న్యాయమూర్తులుగా ఉంటాను అని.. జగన్.. న్యాయమూర్తులతో హెచ్చరికల స్వరంతోనే మాట్లాడేవారట. ఆయనకు బదులుగా సత్సంబంధాలు నెలకొల్పుకోవాలనుకునే ఇద్దరు వైసీపీ నేతలు .. తమదైన స్టైల్లో రాజీ ప్రయత్నాలు చేసి.. న్యాయవ్యవస్థ ఆగ్రహానికి గురయ్యారట. దీంతోనే అసలు సమస్య ప్రారంభమయిందంటున్నారు.
బీజేపీ ఎందుకు ఇవన్నీ సహిస్తోందంటే… ప్రజాగ్రహం విపరీతంగా పెరిగిపోయిన తర్వాత జగన్ ను జైలుకు పంపేసి.. పార్టీని విలీనం చేసుకోవడానికట. జగన్ ను జైలుకు పంపడానికి బీజేపీకి చిటికెలో పని. కానీ విలీనం చేసుకోవడం మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే.. జగన్ మొండితనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే.. మొండివాడి కన్నా రాజు బలవంతుడు కాబట్టి.. మోడీ తల్చుకుంటే ఏమైనా చేయగలరని ఆర్కే ఉద్దేశం కావొచ్చంటున్నారు. మొత్తానికి బీజేపీలో వైసీపీ విలీనం అనేది… క్లైమాక్స్ కావొచ్చని ఆయన చెబుతున్నారు.
మరో వైపు.. తెలంగాణ సీఎంతో పోల్చి… ఏపీని ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి నష్ట పరుస్తున్నారో కొన్ని ఉదాహరణలు చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రుల వ్యవహారం.. డాక్టర్ల అరెస్టులు… పరిశ్రమలకు రాయతీలు ఇవ్వడానికి జగన్ వెనుకడుగు.. పెట్టుబడులు వద్దన్నట్లుగా అధికారులతో ఆయన వ్యవహరిస్తున్న తీరును బయట పెట్టారు. కానీ కేసీఆర్ మాత్రం.. వ్యూహాత్మకంగా… తెలంగాణకు పెట్టుబడుల వరద పారించుకుంటున్నారని.. వివరించారు.