ప్రత్యేకహోదా అంశాన్ని లైవ్‌లోనే ఉంచాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అధికారం చేపట్టిన మొదట్లో ఆయన ప్రత్యేకహోదా గురించి మాట్లాడేవారు. అయితే.. అప్పట్లో బీజేపీ నాయకుల నుంచి తీవ్రమైన హెచ్చరికలు వచ్చాయి. హోదా గురించి ప్రజల్ని మభ్య పెడుతున్నారని .. హోదా ఇచ్చే అవకాశమే లేదని తేల్చేసినా… కేంద్రంపై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఆ తర్వాత బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఏర్పడటంతో.. ఆయన హోదా గురించి ప్రస్తావించడం మర్చిపోయారు. అయితే.. హఠాత్తుగా… హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో హోదా అంశాన్ని ప్రస్తావించారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోతే… విభజన చట్టం అమలు చేసినట్లు కాదని తేల్చేశారు.
ఆ తర్వాత ఇండిపెండెన్స్ డే వేడుకల్లోనూ హోదా అంశాన్ని ప్రస్తావించారు. కేంద్రాన్ని ఇచ్చే వరకూ అడుగుతూనే ఉంటామని చెప్పుకొచ్చారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కేంద్రానికి మన ఎంపీల అవసరం ఉంటేనే ఇస్తుందని లేకపోతే ఇవ్వదని.. ఏపీపై… ఢిల్లీకి పెద్దగా కన్సర్న్ లేదనే అంశాన్ని ప్రజల్లోకి చొప్పిస్తేనే.. అవసరం వచ్చేంత బలం తనకు ఉండాలని ఆయనకు ప్రజలకు సందేశం ఇస్తున్నారు. ఎప్పుడైతే.. కేంద్రం తన డిమాండ్లు.. కోరికల విషయంలో … వ్యతిరేకంగా వ్యవహరిస్తుందో.. అప్పుడు హోదా అంశాన్ని మళ్లీ ఉద్యమంగా మార్చడానికి అవసరమైన గ్రౌండ్‌ను ఆయన ఈ విధంగా సిద్ధం చేసుకుంటున్నారని రాజకీయవర్గాలకు సులువుగానే అర్థం అవుతోంది.
ప్రస్తుతానికి కేంద్రంతో జగన్‌కు జగడం అవసరం లేదు. వీలైనంత వరకూ సహకరిస్తున్నారు. గవర్నర్ కూడా.. వివాదాస్పద బిల్లులు అనుకున్న వాటికీ సంతకాలు పెడుతున్నారు. అవి మధ్యలో ఆగిపోయినా… కోర్టులు కొట్టి వేసినా ఆయన లైట్ తీసుకుంటున్నారు. జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి అడ్డుపడబోమని కేంద్రం ఇప్పటికే బలమైన సంకేతాలు పంపింది. అయితే.. రాజకీయాల్లో ఎప్పుడూ ఒకరి అవసరం ఒకరికి ఉంటేనే మిత్రత్వం సాగుతుంది. ఈ విషయం తెలుసు కాబట్టే.. జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా హోదా అంశాన్ని లైవ్‌లో ఉంచి.. బీజేపీని ఇరుకున పెట్టడానికి ఓ చాన్స్‌ను దగ్గర పెట్టుకుంటున్నట్లుగా భావిస్తున్నారు.