విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి రావాలని ఎంపీ కేశినేని నాని .. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఆహ్వానించారు. ఓ వైపు.. అధికారంలోకి వచ్చిన పధ్నాలుగు నెలల కాలంలో ఫ్లైఓవర్ ను పూర్తి చేశామని వైసీపీ ప్రచారం చేసుకుంటున్న సమయంలో కేశినేని నాని గడ్కరీని ఆహ్వానించడం క్రెడిట్ గేమ్‌లో భాగమేనని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ఫ్లైఓవర్ ఘనత.. గడ్కరీ, చంద్రబాబుదేనని కేశినేని నాని చెబుతున్నారు. రూ. 447 కోట్ల 80 లక్షల రూపాయల అంచనాలతో రూపొందించిన ఈ ప్రాజెక్ట్‌లో.. కేంద్రం వాటా రూ. 333 కోట్ల 21 లక్షలు. భూసేకరణకు అయిన రూ. 114 కోట్లను ఏపీ సర్కార్ భరించింది. వైసీపీ అధికారంలోకి వచ్చేపాటికే 70 శాతం పనులు పూర్తయ్యాయి.
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట్లో ఇసుక కొరత… ఆ తర్వాత కరోనా వల్ల పనులు ముందుకు సాగలేదు. ఇటీవల కాలంలో పనులు జరుగుతున్నాయి. ఆగస్టు నెలాఖరుకు ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. పధ్నాలుగు నెలల్లోనే ఫ్లైఓవర్ పూర్తి చేశామని వైసీపీ నేతలు ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు. కేంద్ర నిధులతో నిర్మించినా ప్రారంభోత్సవం..రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతుంది కాబట్టి.. వైసీపీ నేతలే డామినేట్ చేయనున్నారు. ఎంపీ కేశినేని నానికి ఆహ్వానం పంపుతారో లేదో కూడా అంచనా వేయడం కష్టమే. ఈ సంగతి అంచనా వేసే.. ఎంపీ హోదాలో… ఆ ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులిచ్చిన గడ్కరీని కేశినేని నాని ఆహ్వానించినట్లుగా భావిస్తున్నారు.
ఎలా చూసినా.. ఈ ఫ్లైఓవర్ క్రెడిట్లో అత్యధికం భారతీయ జనతా పార్టీకి దక్కాలి. భూసేకరణ తప్ప.. మిగిలిన మొత్తం.. కేంద్రమే భరించింది. అయితే.. ఈ విషయాన్ని ప్రచారం చేసుకోవడానికి బీజేపీ మొహమాట పడుతోంది. వైసీపీకి ఎక్కడ కోపం వస్తుందో అన్నట్లుగా అసలు ఫ్లైఓవర్‌తో కేంద్రానికి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. తాము నిర్మించామని టీడీపీ.. కాదు తామే నిర్మించామని.. వైసీపీ ప్రచారం చేసుకుంటున్నా.. కేంద్ర అధికార పార్టీగా.. మొత్తం నిధులిచ్చిన బీజేపీకి మాత్రం పట్టడం లేదు.