భూ వివాదాన్ని పరిష్కరించేందుకు రూ. కోటి పది లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఎమ్మార్వో నాగరాజు ఉదంతంలో.. దర్యాప్తు అధికారులు మెల్లగా ఎంపీ రేవంత్ రెడ్డి పేరును ప్రచారంలో పెడుతున్నారు. ఈ వ్యవహారంలో ఎమ్మార్వో నాగరాజుతో పాటు పట్టుబడిన వారిలో కందాటి అంజిరెడ్డి అనే రియల్టర్ ఉన్నారు. ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆ సోదాల్లో… మల్కాజిగిరి ఎంపీ అయిన రేవంత్ రెడ్డి ఎంపీ ల్యాడ్స్కు సంబంధించిన ఫైళ్లు దొరికాయట. అలాగే కలెక్టర్ కార్యాలయంలో ఉండాల్సిన ఫైళ్లు కూడా కొన్ని ఉన్నాయని అనధికారికంగా మీడియాకు సమాచారం ఇచ్చారు ఏసీబీ అధికారులు.
కందాటి అంజిరెడ్డి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి మాత్రమే కాదు.. కాంగ్రెస్ నేత కూడా. మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసిన సమయంలో రేవంత్ రెడ్డి కోసం అంజిరెడ్డి పని చేశారు. ముందుగా ఆయన తెలుగుదేశం పార్టీ నేత. 2014లో ఆయన మల్లారెడ్డి కోసం పని చేశారు. కీసర మండలంలోని కొన్ని గ్రామాల్లో ఆయనకు పట్టు ఉంది. అయితే.. ఆయన మల్లారెడ్డిోత పాటు టీఆర్ఎస్లో చేరలేదు. మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కోసం… పని చేయాలని కోరినా.. అంజిరెడ్డి చేయలేదు. రేవంత్ రెడ్డితో పాటు నడిచారు.
ఇప్పుడు ఆయనే టార్గెట్గా ఏసీబీ దాడులు జరిగాయన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే.. ఎమ్మార్వో లంచం అడిగారని… లంచం ఇస్తున్న వారు ఫిర్యాదు చేయలేదు. అసలు ఫిర్యాదు లేకుండానే ఏసీబీ దాడి చేసింది. అంటే…పక్కాగా నిఘా పెట్టి… లోతైన స్కెచ్ తోనే .. ఈ దాడి జరిగిందన్న చర్చ మాత్రం నడుస్తోంది. ఎమ్మార్వో నాగరాజు ఇంట్లో సోదాలు.. అయిపోయిన తర్వాత… అంజిరెడ్డి మీద ఏసీబీ అధికారులు దృష్టి పెట్టి.. కొత్త కొత్త విషయాలు లీక్ చేయడం.. అందులో రేవంత్ రెడ్డి విషయం ఉంటూడటంతో.. ముందు ముందు ఈ అంశం కీలక మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది.