ధోనీ నిష్కృమణతో ప్రపంచ క్రికెట్ లో ఓ శకం ముగిసినట్టైంది. భారత క్రికెట్ అభిమానులకు మాత్రం… తీరని లోటు. ధోనీ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు కూడా. కాకపోతే… ఓ ప్రత్యామ్నాయం ఉండాలి కదా? ధోనీ వారసుడెవరు? వికెట్ల వెనుక నిలబడేవాడు, ఫినిషింగ్ టచ్ ఇచ్చే వాడు, బ్యాటింగ్ లో ఆదుకునేవాడు.. ఎవరు? ఇది మాత్రం క్లిష్టమైన ప్రశ్నే.
ఒకప్పుడు భారత వికెట్ కీపర్ అంటే… కేవలం వికెట్ల వెనుక నిలబడేవాడు మాత్రమే. తన నుంచి పెద్దగా రన్స్ ఆశించేవారు కాదు. ఓ కీపర్ వన్డేల్లో 50 కొట్టడం గగనం. నయన్ మోంగియా లాంటివాడు టెస్టుల్లో పుష్కరానికోసారి సెంచరీ చేస్తే.. ఆహా ఓహో అనుకునేవాళ్లం. అయితే.. ధోనీ వచ్చాక కీపర్‌కి అర్థం మారిపోయింది. బ్యాటింగులో అద్భుతాలు చేశాడు. బెస్ట్ ఫినిషర్ అనిపించుకున్నాడు. అలా.. బ్యాటింగు, కీపింగూ చేయగలిగే వికెట్ కీపరే మనకు కావాలి.
ధోనీ వారసుడిగా పంత్ పేరు బాగా వినిపించింది. ఐపీఎల్ లో తన బ్యాటింగ్ విన్యాసాలతో ఆకట్టుకున్న పంత్… ధోనీ స్థానాన్ని భర్తీ చేస్తాడేమో అనిపించింది. భారత క్రికెట్ లో కూడా తనకు లెక్కకు మించి అవకాశాలొచ్చాయి.కానీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అప్పటి వరకూ బాగానే ఆడి, ఓ చెత్త షాట్ కొట్టి అవుటైపోయేవాడు. బ్యాటింగ్ శైలి అద్భుతంగా ఉన్నా, నిలకడ లేకపోవడం పంత్ కి శాపం. పైగా మితిమీరిన అంచనాలు పంత్‌ని ముంచేస్తున్నాయి. టెస్టుకైతే పంత్ ఆట అస్సలు సరిపోదు.
కె.ఎల్. రాహుల్ మంచి ప్రత్యామ్నాయం. కాకపోతే.. తను పూర్తిస్థాయి వికెట్ కీపర్ కాదు. మంచి బ్యాట్స్‌మెన్. ఆపధర్మ కీపర్. కీపింగ్ బాధ్యతలు అప్పగిస్తే.. బ్యాటింగ్ పదును ఎక్కడ తగ్గిపోతుందో అన్న భయం పట్టుకుంటుంది. టీ 20 లకు కీపింగ్ చేయగలడేమో. టెస్టు, వన్డేలంటే ఆలోచించుకోవాలి.
వృద్ధిమాన్ సాహా విషయంలోనూ కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. టెస్టు క్రికెట్ కి అచ్చుగుద్దినట్టు సరిపోతాడు సాహా. కానీ పరిమిత ఓవర్లలో రాణించడం లేదు. టెస్టులకు సాహాని, వన్డేలకు పంత్ లతో కొన్నాళ్లు భారత్ సర్దుకుపోవొచ్చు. కాకపోతే.. ధోనీలా వీళ్లెవరిపైనా నమ్మకం ఉంచలేం. గత యేడాదిగా ధోనీ క్రికెట్ కి దూరమయ్యాడు, ఈలోగా పంత్, రాహుల్, సాహాలకు అవవకాశాలొచ్చాయి. కానీ… ఉపయోగం లేకుండా పోయింది. మరో ధోనీని తయారు చేసుకోవాలంటే.. భారత క్రికెట్ కు ఓ జీవిత కాల సమయం పట్టొచ్చు.