ఆంధ్రప్రదేశ్‌లో ఫోన్ ట్యాపింగ్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. న్యాయవ్యవస్థపై నిఘా పెట్టారని.. ఓ దినపత్రిక ప్రచురించింది. విశ్వసనీయమైన సమాచారం.. జడ్జిలు తమ ఫోన్లను సాంకేతిక పరీక్షలు చేయించడంతో ఈ విషయం తెలిసిందన్నట్లుగా ఆ కథనం ఉండటంతో ప్రభుత్వం కూడా ఉలిక్కిపడింది. ఆంధ్రజ్యోతికి లీగల్ నోటీసులు పంపించింది. అయితే.. ఈ విషయంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశించేలా పిటిషన్ వేస్తామని కొంత మంది న్యాయవాదులు చెబుతున్నారు. ఈ లోపే ఈ అంశాన్ని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్రం వద్దకు తీసుకెళ్తున్నారు. అయితే.. ఆయన న్యాయవ్యవస్థ అంశాన్ని కాకుండా.. తన ఫోన్ ట్యాప్ అవుతోందని ఆయన ఫిర్యాదు చేశారు.
తాను పార్లమెంట్ సభ్యుడినని.. అనేక స్టాండింగ్ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నానని.. తన ఫోన్ ను ట్యాప్ చేసి.. కీలకమైన సమాచారాన్ని సేకరిస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అలాగే తన వ్యక్తిగత భద్రత అంశాన్ని కూడా ప్రస్తావించారు. మొదటి నుంచి ఏపీ సర్కార్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్న రఘురామకృష్ణరాజు… ట్యాపింగ్ అంశాన్ని కూడా హైలెట్ చే్సున్నారు. ట్యాపింగ్ అంశం నిజమైతే.. ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరిస్తున్నారు. విచారణ చేయించాలని.. ఆయన డిమాండ్ చేస్తున్నారు. అలాంటి విచారణ జరిగితే.. తన ఫోన్ పైనా జరిగిన ట్యాపింగ్‌పై ఇన్వెస్టిగేష్ చేయాలని ఆయన అంటున్నారు.
వైసీపీకి రఘురామకృష్ణరాజు.. ఇబ్బందికరంగా మారారు. ప్రతిపక్ష నేతల కన్నా ఎక్కువగా రోజూ ప్రెస్మీట్లు పెడుతూ విమర్శలు చేస్తున్నారు. తాను ప్రభుత్వానికి మాత్రమే సూచనలు చేస్తున్నానని.., పార్టీని పల్లెత్తు మాట అనడం లేదని ఆయన అంటున్నారు. అంతే కాదు.. వైసీపీ కూడా.. ఆయన విషయంలో చేయాల్సిందంతా చేసింది. ఇక చేయగలిగిందేమీ లేకపోవడంతో ఆగిపోయింది. ఆనర్హతా వేటుకు స్పీకర్‌కు సిఫార్సు చేయడం దగ్గర్నుంచి ఆయన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఆయన పదవిని తొలగించాలని.. చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఏవీ సక్సెస్ కాలేదు. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలతో ఆయనను కట్టడి చేద్దామనుకుంటే.. ఆయన అంతకు మించి విమర్శలు చేస్తున్నారు.