రిజిస్ట్రేషన్ అక్రమాలను నిరోధించేందుకు ఏపీ ప్రభుత్వం వినూత్నమైన మార్గాన్ని ఎంచుకుంది. స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు వీడియో రికార్డింగ్, పర్యవేక్షణకు ఏర్పాట్లు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వీడియో రికార్డింగ్‌తో పాటు పర్యవేక్షణకు రెవెన్యూశాఖ కార్యాచరణను రూపొందిస్తోంది. ప్రయోగాత్మక ప్రాజెక్టుగా 20 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వీడియో రికార్డింగ్ ప్రక్రియను మొదటగా ప్రారంభించనున్నారు.
క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారు. రాష్ట్రస్థాయిలోని కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షించనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. భూముల అక్రమాలు..డబుల్ రిజిస్ట్రేషన్లు.. ఒకరికి బదులుగా..మరొకరులు వచ్చి స్థలం తనదేనని క్లెయిమ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేయడం వంటి అక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కొంత మంది రెవిన్యూ అధికారులు కూడా అక్రమార్కులతో కుమ్మక్కయి..ఇలాంటి కుంభకోణాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు వీడియో రికార్డింగ్ చేపడితే.. ఎవరెవరు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో పక్కా ఆధారాలు ఉన్నట్లు అవుతాయి.
నిజానికి అక్రమాలు నిరోధించడానికి ప్రభు్తవాలు చాలా కాలంగా.. ఎన్నో కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అమలు చేయాల్సింది కూడా వారే కావడంతో అన్నీ నిరుపయోగంగా మారాయి. ప్రభుత్వం ఈ కొత్త ప్రయత్నాన్ని అయినా పకడ్బందీగా అమలు చేస్తే.. రెవిన్యూ అక్రమాలు పూర్తి స్థాయిలో నిరోధించడానికి అవకాశం ఏర్పడుతుంది.