స్వర్ణా ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై హీరో రామ్ ట్వీట్ చేయడం.. దానిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేయడం వివాదంగా మారింది. తన అభిప్రాయాలు సోషల్ మీడియాలో చెబితేనే ఆయనకు పోలీసులు నోటీసులిస్తామని హెచ్చరికలు చేయడం ఏమిటన్న చర్చ నడుస్తోంది. పోలీసులకు భయపడ్డారో మరో కారణమో కానీ..తాను ఇంక ఆ అంశంపై ట్వీట్లు చేయనని ప్రకటించారు. దాంతో పోలీసుల హెచ్చరికలు ఫలించినట్లయిది. అయితే.. పోలీసులు ప్రతి ఒక్కరిని ఇలా భయపెడుతున్నారా అన్న చర్చ సోషల్ మీడియాలో ప్రారంభమయింది. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.
రామ్‌పై ఏసీపీ వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు. ట్వీట్ పెట్టడమే విచారణకు అడ్డుపడటంగా… నోటీసులు ఇస్తామని బెదిరించడం సరికాదని … రాష్ట్రంలో ప్రాధమిక హక్కులను యథేచ్చగా ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతును అణిచేయాలని చూడటం.. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని విమర్శించారు. మరో వైపు స్వర్ణా ప్యాలెస్ అగ్నిప్రమాదం ఘటన వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది..అది పూర్తిగా కులం కోణంలో సాగుతోంది. వైసీపీ నేతలు.. పోతినేని రమేష్ బాబు పేరును..రమేష్ చౌదరి అని పిలవడం ప్రారంభించారు.
దీంతో… ఓ వర్గం.. పూర్తిగా.. హోటల్ తప్పే కానీ.. వైద్యుల తప్పేముందని వాదించడం ప్రారంభించింది. రమేష్ బాబు ను కులం కారణంగానే వేధిస్తున్నారని.. ఆరోపణలు రావడానికి కారణం అయింది. అనుమతులు ఇస్తేనే..అక్కడ రోగుల్ని ఉంచి చికిత్స చేస్తున్నారని.. ఆ అనుమతులు ఇచ్చిన వారిపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం టార్గెట్ ప్రకారం వెళ్లిపోతోంది. ఎవరి విమర్శలనూ లెక్క చేయడం లేదు.