ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ ని బీసీసీఐ పట్టుకోగలిగింది. చైనా కంపెనీ వీవో ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకోవడంతో.. బీసీసీఐ ఆదాయంలో భారీ కోత ఏర్పడింది. వీవో నుంచి ఐపీఎల్‌కు ప్రతీ యేటా 400 కోట్ల వరకూ వచ్చేవి. దాంతో.. కొత్త స్పాన్సర్ కోసం వేట మొదలైంది. కరోనా నేపథ్యంలో వ్యాపారాలన్నీ చాలా నీరసంగా సాగుతున్న ఈ తరుణంలో… స్పాన్సర్ రూపేణా కోట్లు గుమ్మరించేవారు దొరుకుతారా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే.. డ్రీమ్ 11 ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్‌ని దక్కించుకోగలిగింది. ఈ స్పాన్సర్ షిప్ విలువ దాదాపు 250 కోట్ల వరకూ ఉంటుందని తెలుస్తోంది. టైటిల్ స్పాన్సర్ దొరకడంతో… బీసీసీఐ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటోంది. ఇక నుంచి వీవో ఐపీఎల్ కాస్త.. డ్రీమ్ 11 ఐపీఎల్ గా మారుతుంది. వచ్చే నెలలో దుబాయ్ లో ఐపీఎల్ ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా జట్లు ప్రాక్టీస్ కూడా మొదలెట్టేశాయి.