విజయవాడ స్వర్ణా ప్యాలెస్లో అగ్నిప్రమాదం జరిగితే..గుంటూరులో రాయపాటి సాంబశివరావు కుటుంబం మొత్తాన్ని ముఖ్యంగా వారి ఇంట్లో ఆడవాళ్లందర్నీ ప్రశ్నిస్తున్నారు పోలీసులు. మూడు రోజుల క్రితం..రాయపాటి సాంబశివరావు కోడలు మమతను విజయవాడ పిలిపించి ఏడు గంటల పాటు ప్రశ్నించారు. తనకు కరోనా వచ్చిందని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. ఆమె గుంటూరు రమేష్ ఆస్పత్రి సీవోవోగా ఉన్నారు. ఆ తర్వాత… రాయపాటి సాంబశివరావు సోదరుడి కుమార్తె అయిన రాయపాటి శైలజకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆమె కూడా రమేష్ ఆస్పత్రిలో వైద్యురాలిగా ఉన్నారు.
అయితే..పోలీసులే రమేష్ ఆస్పత్రికి వచ్చి ఆమెను ప్రశ్నించారు. అంతే కాకుండా..అమరావతి పోరాటంలో రైతుల తరపున మహిళా జేఏసీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. విజయవాడ రమేష్ ఆస్పత్రికి..స్వర్ణా హాస్పిటల్ క్వారంటైన్ సెంటర్ కు .. శైలజకు ఎలాంటి సంబంధం లేకపోయినా పోలీసులు నోటీసులు జారీ చేసి ప్రశ్నించడం..అనేక రకాల ఊహాగానాలకు కారణం అవుతోంది. అసలు అగ్నిప్రమాదానికి వైద్యుల నిర్లక్ష్యానికి సంబంధం ఏమిటన్నదానిపై… డాక్టర్ల అసోసియేషన్ ప్రశ్నలు సంధిస్తున్నప్పటికీ ఏపీ పోలీసులు ఏ మాత్ర వెనక్కితగ్గడం లేదు.
రమేష్ ఆస్పత్రిలో అదీ కూడా… ఓ సామాజికవర్గానికి చెందిన వారిని టార్గెట్ చేసి మరీ నోటీసులు… ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. విజయవాడ రమేష్ ఆస్పత్రికి అనుబంధంగా స్వర్ణప్యాలెస్ లో రోగులకు ట్రీట్మెంట్ నిర్వహిస్తున్నారు. ఏమైనా నిర్వహణ లోపాలు ఉంటే.. అక్కడి ఆస్పత్రిలోని వారిని ప్రశ్నించాలి కానీ..గుంటూరు ఆస్పత్రిలో పనిచేస్తున్న వారిని అదీ కూడా.. మహిళలను టార్గెట్ చేయడం ఏమిటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.