విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు శంకుస్థాపన జరిగిపోయినట్లుగా తెలుస్తోంది. కోర్టు కేసులు ఉండటంతో నేరుగా శంకుస్థాపన చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో స్టేట్ గెస్ట్ హౌస్ పేరుతో కాపులుప్పాడ కొండపై భూమిపూజ పూర్తి చేసేసినట్లుగా చెబుతున్నారు. ఈ కార్యక్రమం పదహారో తేదీనే జరగడం… దీనికి మరో సంకేతంగా చెబుతున్నారు. పదహారో తేదీన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు శంకుస్థాపన చేయాలనుకుంటున్నామని.. రావాలని ప్రధాని మోడీని ఏపీ సర్కార్ ఆహ్వానించింది. అయితే.. కోర్టు కేసులు పడ్డాయి. ఈ క్రమంలో వెనుకడుగు వేశారని అనుకున్నారు. అయితే.. బొత్స లాంటి మంత్రులు శంకుస్థాపన జరిగి తీరుతుందని చెబుతూ వచ్చారు. చివరికి అలా.. స్టేట్ గెస్ట్ హౌస్ పేరుతో.. శంకుస్థాపన చేసినట్లుగా చెబుతున్నారు.
శంకుస్థాపన చేసిన తర్వాత టెండర్ల పనులు మొదలు పెట్టారు. స్టేట్‌గెస్ట్ హౌస్ నిర్మాణం పేరుతో ఏకంగా 30 ఎకరాల్లో భారీ ప్రాజెక్టు నిర్మాణాన్ని విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థకు అప్పగించింది. కాపులుప్పాడలోనే రాజధాని వస్తుందని మంత్రి అవంతి శ్రీనివాస్ పదే పదే చెబుతూ ఉంటారు. 30 ఎకరాల్లో నిర్మాణం కానున్న ఈ గెస్ట్ హౌస్ కోసం.. ఆర్కిటెక్చర్ .. ఇతర సేవలు అందించేందుకు.. టెండర్లు పిలిచారు. తర్వాత కాంట్రాక్టర్‌నూ ఎంపిక చేసే అవకాశం ఉంది. తొమ్మిది నెలల్లో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరవాత విశాఖలో శంకుస్థాపన చేసిన మొదటి అభివృద్ధి పని ఇదేనని అంటున్నారు. విశాఖ విమానాశ్రయానికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ కాపులుప్పాడ కొండ ఉంటుంది.
పాలనా రాజధానిని తరలించడానికి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతూండటంతో… ఇప్పటికి ఏదో ఓ పేరుతో నిర్మాణాలు ప్రారంభించి.. న్యాయస్థానాల్లో స్టేలు దక్కించుకున్న తర్వాతనో… అనుకూలంగా తీర్పులు వచ్చిన తర్వాతనో.. ఆలస్యం లేకుండా.. ఆయా భవనాల్లో సీఎంవో.. సెక్రటేరియట్లు తరలించడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం.. అది స్టేట్ గెస్ట్ హౌస్ కోసమేనని… రాష్ట్రపతి లాంటి వీఐపీలు వచ్చినప్పుడు.. విడిది కోసం అంటున్నారు. నిజానికి రాష్ట్రపతి ఐదేళ్లలో ఒకటి రెండు సార్లు కూడా విశాఖకు వచ్చే సందర్భాలు ఉండవు.