దేశ రాజ్యాంగాధిపతి రాష్ట్రపతి ఆదేశాలకూ ఏపీలో దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రపతి కార్యాలయం జారీ చేసిన ఆదేశాలను… అధికారులు అమలు చేయడానికి సిద్ధపడలేదు. ఎక్కడ ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందనుకున్నారో కానీ.. అసలు పట్టించుకోలేదు. దీంతో రాష్ట్రపతి భవన్ ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాల్సి వచ్చింది. ఈ వ్యవహారం… తూ.గో జిల్లా సీతానగరం శిరోముండనం బాధితుడు వరప్రసాద్ విషయంలో జరిగింది. వరప్రసాద్ శిరోముండనం ఘటనలో తనకు న్యాయం జరగలేదని.. నక్సలైట్లలో కలిసేందుకు అనుమతి ఇవ్వాలిని రాష్ట్రపతిని కోరతూ లేఖ రాశారు.
దళితుడి శిరో ముండనాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. బాధితుడు వరప్రసాద్‌కు అండగా ఉండేందుకు ప్రత్యేక అధికారిని నియమించారు. ఏపీ జీఏడీలో అసిస్టెంట్ సెక్రటరీ జనార్ధన్ బాబును కలవాలని, శిరోముండనం కేసు విషయంలో ఆయనకు సహకరించాలని వరప్రసాద్‌కు రాష్ట్రపతి కార్యాలయం సూచించింది. అయితే ఆ కేసులో ప్రభుత్వమే లైట్ తీసుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. మంత్రి విశ్వరూప్ లాంటి వాళ్లు నక్సలైట్లలో కలవాలనుకుంటే కలవొచ్చుగా పర్మిషన్ ఎందుకు అని ప్రశ్నించారు. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న కొంత మంది వైసీపీ నేతల ప్రోద్భలంతోనే వరప్రసాద్‌కు శిరోముండనం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వీడియోలు కూడా బయటకు వచ్చాయి. కానీ పోలీసులపై చర్యలు తీసుకున్నారు కానీ.. అసలు నిందితులపై చర్యలు తీసుకోలేదు. దీంతో న్యాయం కోసం వరప్రసాద్ పోరాడుతున్నారు.
రాష్ట్రపతి కార్యాలయం ఆదేశించినట్లుగా వరప్రసాద్ విషయాన్ని తాను తీసుకుంటే.. ఇబ్బంది పెడతారని అనుకున్నారేమో కానీ.. జనార్ధన్ బాబు ముందుకు రాలేదు. దాంతో మళ్లీ ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం దృష్టికి వరప్రసాద్ తీసుకెళ్లాడు. దీంతో కేసు ఫైల్‌ను కేంద్ర సామాజిక న్యాయ శాఖకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. దీన్ని ఎమర్జెన్సీ కేసుగా పరిగణించి వెంటనే విచారణ జరపాలంటూ రాష్ట్రపతి సెక్రటరీ అశోక్ కుమార్ ఆదేశాలిచ్చారు. ఏపీలో దళితులపై జరుగుతున్న వరుస దాడుల్లో వరప్రసాద్ ఘటన ఒకటి. విషయం బయటపడిన తర్వాత కూడా ఆయనకు కనీసం న్యాయం దక్కని పరిస్థితి ఏర్పడింది. చివరికి రాష్ట్రపతి జోక్యం చేసుకున్నా.. అదే దుస్థితి.