ఓ స్టార్ హీరో – ఓ స్టార్ డైరెక్టర్..
ఇదీ కదా కాంబినేషన్. ఇలాంటి కాంబినేషన్లకు ఓ రేంజ్ ఉంటుంది. కానీ.. ప్రభాస్ అలాంటి కాంబినేషన్లని మిస్సవుతున్నాడేమో అనిపిస్తోంది.
టాలీవుడ్ లోనే కాదు, దేశంలోనే అగ్ర కథానాయకుల జాబితాలో తప్పకుండా ప్రభాస్ ఉంటాడు. తను ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. కాకపోతే… దర్శకుల్ని ఎంపిక చేసుకునే విషయంలో ప్రభాస్ అంతగా స్టార్ ఇమేజ్ ని పట్టించుకోవడం లేదు.
బాహుబలి తరవాత.. ప్రభాస్ రేంజ్ పెరిగింది. తాను తలచుకుంటే, వచ్చిన అవకాశాల్ని ఒప్పుకుంటే.. బాలీవుడ్ రేంజ్ దర్శకుడితో సినిమా చేయొచ్చు. కానీ అలా చేయలేదు. ఒక సినిమా అనుభవం ఉన్న సుజిత్ కి ఛాన్స్ ఇచ్చాడు. భారీ బడ్జెట్, హంగులతో తెరకెక్కించిన సాహో మిశ్రమ ఫలితాన్ని సాధించింది. బాహుబలి రేంజ్, ఆ సినిమా తరవాత పెరిగిన ప్రభాస్ ఇమేజ్ ని `సాహో` కథ మోయలేకపోయింది.
`సాహో` తరవాత… రాధాకృష్ణతో సినిమా చేస్తున్నాడు. తనదీ ఓ సినిమా అనుభవమే. పైగా `జిల్` పెద్దగా ఇంప్రెస్ చేసిన సినిమా కూడా కాదాయె. `రాధే శ్యామ్ ` తరవాత.. నాగ అశ్విన్ సినిమా ఓకే చేశాడు. ఇప్పుడు `ఆది పురుష్`. ఇలా ఎలా చూసినా… పెద్దగా అనుభవం లేని దర్శకుల్ని ఎంపిక చేసుకుంటూ వెళ్తున్నాడు ప్రభాస్.
టాలీవుడ్ లో త్రివిక్రమ్, బోయపాటి, సుకుమార్, కొరటాల.. ఇలా చాలామంది స్టార్ దర్శకులు ఉన్నారు. తమిళనాటచూస్తే.. శంకర్ లాంటివాళ్లున్నారు. వీళ్లందరినీ ప్రభాస్ మిస్ అవుతున్నాడేమో అనిపిస్తోంది.
త్రివిక్రమ్ – ప్రభాస్
సుకుమార్ – ప్రభాస్
బోయపాటి – ప్రభాస్
ఈ కాంబినేషన్లు ఎంత టెమ్టింగ్ గా ఉంటాయి? సినిమాని యేడాదిలోపే పూర్తి చేసి ఇవ్వగల సమర్థులు వీళ్లు. మార్కెట్ పరంగా అంచనాలు ఆకాశంలో ఉంటాయి. కావలిస్తే.. పాన్ ఇండియా ప్రాజెక్టుగానూ మలచుకోవొచ్చు. అయితే.. ప్రభాస్ మాత్రం ఇవేం ఆలోచించడం లేదు. తన దగ్గరకు వచ్చిన కథల్లో ది బెస్ట్ అనుకున్నవి, పాన్ ఇండియా రేంజ్ ఉన్నవీ చేసుకుంటూ వెళ్తున్నాడు. కొంతమంది స్టార్ హీరోలు మాత్రం.. `ఈ టైమ్ లో ఏ దర్శకుడితో చేస్తే బాగుంటుంది?` అని ఆలోచించి, ఆయా దర్శకుల్ని పిలిపించుకుని, కథలు తయారు చేయించుకుని సినిమాలు తీస్తున్నారు. కానీ ప్రభాస్ దగ్గర మాత్రం ఇలాంటి ప్లానింగు లేదు. ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు పూర్తయి, మరో దర్శకుడికి అవకాశం ఇచ్చేనాటికి, మరో ఐదేళ్లు పడుతుంది. అప్పుడు త్రివిక్రమ్ ఎక్కడో? సుకుమార్ ఎక్కడో? బోయపాటి ఎక్కడో? ఈమధ్యలో చాలా చాలా జరిగిపోవొచ్చు. పాన్ ఇండియా క్రేజ్ మంచిదే. బడ్జెట్లు పెరుగుతాయి. ఇమేజ్ పెరుగుతుంది. కానీ.. తెలుగుదనం మాత్రం కొరవడుతుంది. రాబోయే ప్రభాస్ సినిమాల్లో మిస్సింగ్ ఎలిమెంట్ ఏమైనా ఉందంటే, అది ఇదే.