ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు ధృవీకరించారు. ఆయన ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారని, ప్రస్తుతం ఎక్మో సపోర్ట్‌తో వైద్యం చేస్తున్నట్టు డాక్టర్లు తాజా హెల్త్ బులిటెన్ లో తెలిపారు. బాలుకి వెంటిలేటర్ తొలగించారని, ఆయన ఐసీయూ నుంచి సాధారణ గదికి వచ్చారని వార్తలు వచ్చాయి. కానీ అవేం నిజం కాదని, బాలు తనయుడు ఎస్.పి. చరణ్ ఇది వరకే తెలిపారు. ఐసీయూలో చేరినప్పటి నుంచీ, ఇప్పటి వరకూ బాలు ఆరోగ్యంలో ఎలాంటి మార్పూ లేదని వైద్యులు ధృవీకరించారు. అయితే తాము శక్తివంచన లేకుండా కృషి చేస్తూనే ఉన్నామని తెలిపారు. బాలు కోసం దాదాపు 12 మందితో కూడిన ప్రత్యేక వైద్యబృందం అహర్నిశలూ శ్రమిస్తోంది. బాలు త్వరగా కోలుకోవాలని యావత్ సినీ ప్రపంచం ఒక్కటై ప్రార్థనలు చేస్తోంది. రేపు.. అంటే గురువారం తమిళ సంగీత ప్రపంచం అంతా బాలు కోసం సామూహిక ప్రార్థనలు చేయాలని తమిళ చిత్రసీమ ఓ ప్రకటనలో తెలిపింది.