ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరో ప్రైవేటు వ్యక్తులు పరిశ్రమలు పెట్టుకుంటే తామెందుకు ప్రోత్సాహకాలివ్వాలన్న పద్దతిలో పారిశ్రామిక విధానం రూపొందించుకుంటే.. తెలంగాణ మాత్రం కరోనా కాలంలోనూ.., పెట్టుబడులు ఆకర్షించేందుకు దూకుడైన విధానంతో ముందుకు వెళ్తోంది. భారీ ఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటించి.. పరిశ్రమల్ని ఆకర్షిస్తోంది. మంత్రి కేటీఆర్.. ఈ విషయంలో ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ఎనిమిది భారీ పరిశ్రమలతో ఆయన చర్చలు జరిపారు. అవి కోరిన రాయితీలిచ్చి.. పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరింపచేశారు.
ఎనిమదిి భారీ పరిశ్రమల్లో అయిదు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు. ఇవన్నీ కలిసి దాదాపుగా రూ. పదివేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ పరిశ్రమలు అడిగిన రాయితీలు..ఇతర సౌకర్యాల కల్పన విషయంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి..ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఎనిమిది పరిశ్రమలకు పారిశ్రామిక రాయితీలు, ప్రోత్సాహకాలిచ్చేందుకు ఉప సంఘం అనుమతించింది. ఈ పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని తమ ప్రతిపాదనల్లో వెల్లడించగా… దీని కింద అదనపు రాయితీలిచ్చేందుకు అంగీకరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి తర్వాత అధికారికంగా ఆ పరిశ్రమల వివరాల్ని ప్రకటించనున్నారు.
పొరుగు రాష్ట్రాల నుంచి పరిశ్రమలకు ఇప్పుడు పెద్దగా పోటీ లేకపోవడంతో… తమ విధానాలను మరింత సరళీకరించుకుంటున్న తెలంగాణ సర్కార్.. పరిశ్రమల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. కొత్తగా ఆహారశుద్ధి, లాజిస్టిక్ పార్కుల విధానాలను ఖరారు చేశారు. కేబినెట్ భేటీలో ఆమోదించి అమలు చేయనున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో.. కొన్ని పరిశ్రమలు డీలాపడ్డాయి. కానీ అదే సమయంలో.. కొన్ని పరిశ్రమలకు కొత్త మార్కెటింగ్ అవకాశాలు వచ్చాయి. ఇలాంటి వాటిపై దృష్టి పెట్టిన కేటీఆర్… పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్నారు. గతంలో ఏపీ వైపు చూసిన అనేక పరిశ్రమలు.. ఇప్పుడు తెలంగాణ దగ్గరే ఆగిపోతున్నాయి.