విజయవాడ సర్ణా హోటల్లో జరిగిన అగ్నిప్రమాదం విషయంలో అసలు నిందితుల్ని.. తప్పు చేసిన వారిని పట్టుకోవడం కన్నా… తాము టార్గెట్ చేసిన వారిని వేధించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. కమిటీలు ఇస్తున్న రిపోర్టులు కూడా అలాగే ఉంటుంది. అసలు ప్రధానంగా స్వర్ణా హోటల్లో అగ్నిప్రమాదం ఎలా జరిగిందో తేల్చాలని ప్రభుత్వం కమిటీలు నియమించింది. నిన్నటికి నిన్న విచారణ కమిటీ ఓ నివేదిక ఇచ్చింది. ఇందులో.. అసలు అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై కాకుండా.. రమేష్ ఆస్పత్రి బాగా డబ్బులు వసూలు చేస్తోందని.. నిబంధనలు ఉల్లంఘిస్తోందని నివేదిక సమర్పించారు.
రమేష్ ఆస్పత్రి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్థారించామని కమిటీ నివేదిక ప్రభుత్వానికి సమర్పించారు. కోవిడ్ సెంటర్ కోసం కేంద్రం ఇచ్చిన నిబంధనలను ఉల్లంఘించారని. డబ్బు సంపాదనే ధ్వేయంగా చట్టాలను పట్టించుకోలేదని కమిటీ చెప్పుకొచ్చిది. అవసరం లేకున్నా రెమిడెసివర్ పేషెంట్లకు వాడారని తేల్చారు. పేషంట్లకు ఏ టాబ్లెట్లు వాడాలో.. ఏది వాడకూడదో కూడా.. కమిటీ చెప్పిందన్నమాట. అలాగే రమేష్ ఆస్పత్రిలో అనుమతి లేకుండా ప్లాస్మా థెరపీని నిర్వహించారని .. ఎలాంటి అనుమతులు లేకుండా ఎం- 5, మెట్రోపాలిటన్ హోటళ్లలో..రమేష్ ఆస్పత్రి కోవిడ్ కేర్ సెంటర్లు నిర్వహించిందని కమిటీ తేల్చింది. ఆస్పత్రిలో అగ్ని ప్రమాదాలను నివారించే పరికరాలు లేవన్నది.
అసలు అగ్నిప్రమాదం జరిగింది రమేష్ ఆస్పత్రిలో కాదు. స్వర్ణా హోటల్లో అక్కడ రమేష్ ఆస్పత్రి పేషంట్లను ఉంచి చికిత్స అందిస్తోంది. హోటల్ నిర్వహణ … ఆ హోటల్ యాజమాన్యమే చూసుకుంటోంది. అక్కడ వైద్య పరంగా రమేష్ ఆస్పత్రి ఏమైనా తప్పులు చేసి ఉంటే తప్పని సరిగా శిక్షించాలి. తప్పులు బయట పెట్టాలి. కానీ హోటల్ యాజమాన్యాన్ని వదిలేసి.. ఆ ప్రమాదం జరిగిందో ఆరా తీసి… తప్పు చేసిన వారిని శిక్షించాల్సి వదిలేసి.. డాక్టర్లను టార్గెట్ చేయడం… వివాదాస్పదం అవుతోంది. అసలు ఈ కమిటీలు ఇస్తున్న నివేదికలతో.. ప్రమాదం జరిగింది.. నిర్లక్ష్యం ఎక్కడ ఉంది అన్నది పక్కకపోయి.. రమేష్ ఆస్పత్రిలో అలా చేశారు.. ఇలా చేశారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభుత్వం చిత్తశుద్ధిపైనే అనుమానాలు తలెత్తే ప్రమాదం ఏర్పడింది.