పీసీసీ అధ్యక్షుడి ప్రకటన రేపో మాపో ఉంటుందని ఢిల్లీ నుంచి సంకేతాలు వస్తున్నాయేమో కానీ.. మళ్లీ టీవీ 9లో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అరగంట కథనాలు ప్రారంభమయ్యాయి. గతంలో కర్ణాటకకు పీసీసీ అధ్యక్షుడిగా శివకుమార్‌ను నియమించిన సందర్భంలోనే రేవంత్ రెడ్డిని కూడా నియమిస్తారని చెప్పుకున్నారు. అయితే అప్పుడే రేవంత్ రెడ్డిని డ్రోన్ కేసులో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత టీవీ9లో కరోనాను మించి రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తూ కవరేజీ ఇచ్చారు. అనేకానేక ఆరోపణలు అరంగటలు.. అరగంటలు స్పెషల్ స్టోరీస్ ఇచ్చారు. ఆ తర్వాత సైలెంటయ్యారు. మళ్లీ ఇప్పుడు టీవీ9 రేవంత్ కోసం అరగంట కేటాయించడం ప్రారంభించింది.
టీవీ9 ప్రధానంగా ఇటీవల కీసర ఎమ్మార్వోపై దాడి చేసిన సమయంలో…అక్కడ ఉన్న అంజిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో రేవంత్ రెడ్డికి సంబంధించిన డాక్యుమెంట్లు దొరికాయని..అవి ల్యాండ్ డీలింగ్స్‌కు సంబంధించినవి… చెప్పడం ప్రారంభించింది. ఏసీబీ అధికారులు మీడియాకు అలాంటి లీకులే ఇచ్చారు. అందుకే హిందూ లాంటి పత్రిక కూడా రేవంత్ రెడ్డి పేరు చెప్పకుండా.. ఆ మాటలను ప్రచురించేసింది. కానీ తర్వాత నిజం తెలుసుకుంది. ఎంపీ రేవంత్ రెడ్డి… సమాచారహక్కు చట్టం కింద తెలుసుకోవాలనుకున్నది కాలేజీలకు సంబంధించిన సమాచారమే కానీ… భూముల సమాచారం కాదని.. వివరణ కథనం కూడా ఇచ్చింది. అయితే.. టీవీ 9 మాత్రం అలాంటిదేమీ పట్టించుకోకుండా… వ్యక్తిగత దూషణలతో కథనాలు టెలికాస్ట్ చేసేస్తోంది.
రేవంత్ రెడ్డిని రాజకీయంగా దెబ్బకొట్టే కథనాలు కూడా.. ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రియాంక గ్రూప్‌లో చేరారని… దీని సారాంశం. ఈ ప్రచారం ఓ రేంజ్లో ఉండటంతో రేవంత్ రెడ్డి కూడా స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మొత్తానికి రేవంత్ రెడ్డిపై ఉన్నవీ.. లేనివీ రాసేసి.. ఆయనను పీసీసీ చీఫ్ పదవి వరకూ రాకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని… ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇందులో టీవీ9కి ఉన్న ప్రత్యేక ఆసక్తి ఏమిటో సులువుగానే అర్థం చేసుకోవచ్చు.